పోలీసులపై ప్రతాపమా..? షర్మిల, విజయమ్మ తీరుపై సర్వత్రా విమర్శలు..!
తెలంగాణలో సత్తా చాటాలని వై.ఎస్.షర్మిల పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాదయాత్ర పూర్తి చేసేసి ఇప్పుడు అంశాలవారీగా పోరాటాలు చేస్తున్నారు. ఎలాగైనా వార్తల్లో నిలిచేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ గా చేసుకుని ఆమె తీవ్రంగా మాటలదాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆమె పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయమ్మ కూడా బయటికొచ్చి పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. అయితే బాధ్యుతలపై చర్యలు తీసుకోవడం లేదని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని షర్మిల ఆరోపిస్తున్నారు. షర్మిల ఎక్కడికెళ్లినా ఈ అంశం లేవనెత్తుతున్నారు. అయితే ఇవాళ ఆమె సిట్ కార్యాలయాన్ని సందర్శిస్తారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆమె పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఇంటి బయటకు వచ్చారు. కాలి నడకన బయలుదేరారు. అయితే ఆమెను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. ఇది ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పోలీసులను నెట్టేసి ముందుకు వెళ్లసాగారు. అయినా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. పని లేకపోతే వెళ్లి గాడిదలు కాసుకోండి అని పోలీసులకు సూచించారు. ఇప్పుడు ఆ పనే చేస్తున్నామని పోలీస్ అధికారి బదులివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనంతరం షర్మిలను అరెస్టు చేసి పోలీస్టేషన్ కు తరలించారు.
షర్మిలను అరెస్టు చేయడంతో ఆమె తల్లి విజయమ్మ రంగప్రవేశం చేశారు. షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వారిపై విజయమ్మ చేయి చేసుకున్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేస్తారా.. అని ప్రశ్నించారు. షర్మిలను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
అయితే అటు షర్మిల, ఇటు విజయమ్మ పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా పోలీసులపై దాడిని వాళ్లు సమర్థించుకోవడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. తనపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆత్మరక్షణ కోసం తాను అలా చేయడం తప్పేమీ కాదని షర్మిల సర్దిచెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణలో తల్లీకూతుళ్లు ఏంసాధిస్తారని, వెళ్లి ఏపీలో తేల్చుకోవాలని బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్నారు.













