కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడిందా..?
ఇదిగో విలీనం.. రేపే ప్రకటన.. అంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నా షర్మిల పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మొన్నటి వరకూ ఈ విలీనం వార్త హల్ చల్ చేసింది. రేపోమాపో విలీనం ఖాయం.. షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి.. అని కథనాలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఉలుకూపలుకూ లేదు. అసలు విలీనం ఎప్పుడు జరుగుతుందో ఏ పార్టీలోనూ క్లారిటీ లేదు. అసలు జరుగుతుందా.. జరగదా.. అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై అటు షర్మిల కానీ, ఇటు కాంగ్రెస్ నేతలు కానీ నోరు మెదపడం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ … ఈసారి తెలంగాణలో తమదే అధికారం అని చెప్పుకుంటున్నాయి. అయితే తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో పార్టీ పెట్టింది వైఎస్ షర్మిల. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు పాపులారిటీ ఉంది. అది కచ్చితంగా వర్కవుట్ అవుతుందని.. తెలంగాణలోని వైఎస్ అభిమానులంతా తన వెంట నడుస్తారని ఆవిడ కలలు కన్నారు. అయితే అది కలగానే మిగిలిపోయింది. నేతలెవరూ షర్మిల వెంట రాలేదు. కనీసం ప్రజల నుంచి కూడా స్పందన లభించలేదు. దీంతో పార్టీపై పునరాలోచనలో పడ్డారు షర్మిల.
ఒంటరిగా తెలంగాణలో పార్టీని నడిపించడం, దాన్ని అధికారంలోకి తీసుకురావడం అంత ఈజీ కాదనుకున్న షర్మిల.. వెంటనే కాంగ్రెస్ పార్టికి విలీన ప్రతిపాదన పంపించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసి షర్మిల ఈ ప్రతిపాదన చేశారు. ఆయన మధ్యవర్తిత్వంతో విలీనానికి సోనియా, రాహుల్ ఒప్పుకున్నారు. వైఎస్. ఎప్పటికీ తమవాడేనని.. తమను వ్యతిరేకించి వెళ్లిపోయిన కుటుంబంలో ఒకరు మళ్లీ వస్తామంటే అది తప్పకుండా తమకు ప్లస్ అవుతుందని గాంధీ ఫ్యామిలీ భావించింది. అందుకే ఎవరెన్ని ఆటంకాలు చెప్తున్నా పట్టించుకోకుండా షర్మిల పార్టీ విలీనానికి ఓకే చెప్పింది.
సోనియా, రాహుల్ తో షర్మిల కూడా ఢిల్లీ వెళ్లి భేటీ అయి వచ్చారు. రెండు మూడు రోజుల్లోనే విలీనంపై అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ పది రోజులైనా ఇంతవరకూ ఆ ప్రకటన రాలేదు. కనీసం ఇప్పుడు విలీనంపై ఊహాగానాలు కూడా పెద్దగా రావట్లేదు. దీంతో విలీనం ఉంటుందా.. ఉండదా అనేది అనుమానంగా మారింది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. కనీసం అప్పటికైనా విలీనంపై ముందడుగు పడుతుందని షర్మిల వర్గీయులు భావిస్తున్నారు. ఈలోపు అయితే ఓకే.. లేకుంటే ఒంటరిబాట తప్పదనేలా ఆ పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













