టీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్న గుర్తులు..! ఆ ఎనిమిదింటిపైనే అభ్యంతరం..!!
మునుగోడు ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. గెలిచేది తామేనని ఇప్పటికే ఘంటాపథంగా చెప్తున్నా.. విపక్షాలకు ఏ చిన్న అవకాశాన్నీ ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చింది. అందుకే గత ఎన్నికలు నేర్పిన పాఠాలను బయటకు తీసి జాగ్రత్త పడుతోంది. గతంలో హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో కారును పోలిన ఎన్నికల గుర్తులు ఇతరులకు కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో చాలా మంది కారే అనుకుని ఆ గుర్తులకు ఓట్లేశారు. దీంతో వారికి భారీగా ఓట్లు పోలయ్యాయి. ఇది టీఆర్ఎస్ గెలుపుపై ప్రభావం చూపింది.
ఇప్పుడు మునుగోడులో ఆ ఛాన్స్ ఇవ్వకూడదనుకుంటోంది టీఆర్ఎస్. మునుగోడు ఉపఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. ఒక చిన్న ఉపఎన్నిక కోసం బీజేపీ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగి వ్యూహరచన చేస్తుండడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన జోష్ బీజేపీలో కనిపిస్తోంది. అదే ఊపుతో ఇప్పుడు మునుగోడులో కూడా గెలిచి తీరుతామని నమ్ముతోంది బీజేపీ. మరోవైపు టీఆర్ఎస్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. అయితే ఎక్కడో చిన్నపాటి భయం నెలకొంది. గతంలో గుర్తులు తెచ్చిన తంటాలు ఆ పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చాయి. అందుకే ఈసారి మరింత జాగ్రత్త పడుతోంది. కారును పోలిన 8 గుర్తులను ఇతరులెవరికీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
రోడ్ రోలర్, చపాతి రోల్, ఓడ, కెమెరా, డాలీ, కుట్టుమిషన్, సబ్బు డబ్బా.. లాంటి గుర్తులు బ్యాలెట్ పేపర్ పై కారును పోలి ఉంటున్నాయి. ఇలాంటి గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తోంది ఎన్నికల సంఘం. గతంలో ఈ సింబల్స్ ను పొందిన అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయని.. ఓటర్లు కారు అనుకుని పొరపాటున వేయడంతోనే ఇలా ఎక్కువ ఓట్లు వారికి వచ్చాయని టీఆర్ఎస్ చెప్తోంది. అలా జరగడం వల్లే స్వల్ప మెజారిటీతో తమ అభ్యర్థులు ఓడిపోయినట్లు వెల్లడించింది.
2018 ఎన్నికల్లో ఏడు స్థానాల్లో ఓడిపోవడానికి ఇలాంటి గుర్తులే కారణమని టీఆర్ఎస్ నమ్ముతోంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, పాలేరు, నకిరేకల్, తాండూరు లాంటి చోట్ల రోడ్డు రోలర్, ట్రాక్టర్, జీపు గుర్తులు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీగా ఓట్లు నమోదయ్యాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మునుగోడులో కూడా స్వతంత్ర అభ్యర్థులు భారీగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో వారికి కూడా ఇలాంటి గుర్తులను ఈసీ కేటాయించే అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ గుర్తులను వేరెవరికీ కేటాయించవద్దని అభ్యర్థించింది.
దుబ్బాకలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఓ అభ్యర్థికి రోటీ మేకర్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఇది కారు గుర్తును పోలి ఉంది. అతనికి 3400 ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 62వేల 7వందల ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 61వేల 3వందల ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో కాంగ్రెస్, నాలుగో స్థానంలో రోటీమేకర్ గుర్తు పొందిన స్వతంత్ర అభ్యర్థి నిలిచారు. ఈ స్వతంత్ర అభ్యర్థికి పొందిన ఓట్లు టీఆర్ఎస్ కు పడి ఉంటే అక్కడ టీఆర్ఎస్ గెలిచేది. అందుకే ఇప్పుడు ముందుగానే అలెర్ట్ అయింది టీఆర్ఎస్. మరి ఎన్నికల సంఘం కనికరిస్తుందో లేదో చూడాలి.













