కాంగ్రెస్ సీనియర్ల అసమ్మతి రాగం వెనుక భారీ వ్యూహం..?
ప్రత్యర్థి వీక్ గా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలని చెప్తుంటారు రాజకీయ పండితులు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలూ ఎత్తులు పైఎత్తులతో బిజీగా ఉన్నాయి. ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఇప్పటి నుంచే వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమైపోతున్నాయి. తాము బలపడేందుకు ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులపై కన్నేశాయి. ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు బయటికొస్తున్నాయి. ఇదే మంచి ఛాన్స్ గా భావిస్తున్న పార్టీలు అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో బీజేపీ ముందుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
అంతర్గత విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ సతమతమవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, సీనియర్ నేతలకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు సహించలేకపోతున్నారు. సీనియర్ల అసంతృప్తిని గమనించిన అధిష్టానం జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. దీంట్లో కూడా తమకు అన్యాయమే జరిగిందని సీనియర్లు గరంగరంగా ఉన్నారు. అయితే రేవంత్ వర్గం మాత్రం సీనియర్ల ఆరోపణలను తోసిపుచ్చుతోంది. టీడీపీ నుంచి వచ్చిన కేవలం 13 మందికి మాత్రమే కార్యవర్గంలో చోటు దక్కినట్లు పేర్లతో సహా వెల్లడించింది. అయినా సీనియర్ల మాటలు పడలేక వాళ్లంతా పదవులకు రాజీనామా చేశారు. అయినా సీనియర్లు శాంతించట్లేదు. రేవంత్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే సీనియర్ల అసమ్మతిరాగం వెనుక భారీ వ్యూహమే ఉందని కొందరు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు చెప్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్.. తదితర నేతలు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని వదిలి రావాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీయే అధికారంలోకి రాబోతోందని వాళ్లకు చెప్పినట్లు సమాచారం. అంతేకాక అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందని వాళ్లకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇక భవిష్యత్ లేదని.. కాబట్టి బీజేపీలోకి వస్తే అందరం కలిసి పనిచేద్దామని సూచించినట్లు సమాచారం. అంతేకాక.. ఎవరికి ఏ పదవి ఇస్తామనేది కూడా వాళ్ల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
బీజేపీ ఆఫర్ కు కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అత్యంత సీనియర్ గా ఉంటూ, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక నేత తనకు ఏదైనా గవర్నర్ పదవి కోరినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ అధిష్టానంతో సంప్రదించి చెప్తామని బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కొంతమంది నేతలు తమకు ఫలానా నియోజకవర్గం కావాలని, తమతోపాటు వచ్చే నేతలకు ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పదవులు కావాలని కోరినట్లు తెలుస్తోంది. నలుగురు సీనియర్ నేతలు తమతోపాటు 20 నుంచి 25 మందిని తీసుకొస్తామని బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు.. వారి ప్రతిపాదనలను బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం దాదాపు ఖరారే అని చెప్పొచ్చు. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.













