రేవంత్ ముందు రెండు అగ్ని పరీక్షలు..! ఎదుర్కోగలరా..?
పీసీసీ చీఫ్ గా ఏరోజైతే రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారో.. అప్పటి నుంచి ఆయన కష్టాలు అన్నీఇన్నీ కావు. పార్టీ ఏ ఒక్కరూ ఆయన్ను మనస్ఫూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. అయినా తనపై పీసీసీ బాధ్యతలు పెట్టారు కాబట్టి తన శక్తిమేరా పార్టీని నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా అటు హైకమాండ్ నుంచి, ఇటు కేడర్ నుంచి రేవంత్ రెడ్డికి అవమానాలు, విమర్శలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక, రాహుల్ జోడో యాత్ర.. రేవంత్ కు మరోసారి అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి. మరి వీటిని రేవంత్ ఎలా ఎదుర్కోబోతున్నారు..?
దేశంలోనే కాదు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. పార్టీకి మంచి లీడర్లున్నా.. దాన్ని నడిపేందుకు, నడిపించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ లో ముందు నుంచి అంతర్గత పోరు నడుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ అప్పగించిన తర్వాత ఇక ఆ విభేదాలకు అంతే లేకుండా పోయింది. పార్టీలో ముందు నుంచి ఉన్న లీడర్లెవరూ రేవంత్ మాట వినేందుకు ముందుకు రావట్లేదు. పార్టీ అధిష్టానం చెప్పినా కూడా లీడర్లు ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. పైగా బహిరంగంగానే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రేవంత్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. హైకమాండ్ ఆదేశాల మేరకు అన్నీ సహిస్తూ పార్టీని తన శక్తిమేరా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు రేవంత్.
పీసీసీ అధ్యక్షుడయ్యాక హుజూరాబాద్ ఎన్నిక రేవంత్ కు పరీక్ష పెట్టింది. అయితే అది సిట్టింగ్ స్థానం కాకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మునుగోడు అలా కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. దీన్ని కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. ఈ స్థానంలో గెలిస్తే రేవంత్ రెడ్డికి తిరుగుండదు. కచ్చితంగా రేవంత్ రెడ్డిని అటు హైకమాండ్, ఇటు కేడర్ గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓడిపోతే మాత్రం రేవంత్ కు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. పార్టీ నేతలే ఆయనపై మరిన్ని రాళ్లు విసిరేందుకు సిద్ధంగా ఉంటారు. వాటిని తట్టుకోవడం అంత ఆషామాషీ కాదు.
రేవంత్ ముందున్న మరో ముఖ్యమైన టాస్క్ రాహుల్ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడం. మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. కాబ్టటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ జోడో యాత్ర గురించి రేవంత్ పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ పరిశీలకుడు కె.సి.వేణుగోపాల్ కూడా ఇదే అంశాన్ని రేవంత్ కు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇంతవరకూ ఒక్క బ్యానర్ కూడా కట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్ను నవ్వు ప్రమోట్ చేసుకోవడం కాదని.. పార్టీని కూడా ప్రమోట్ చేయాలని సూచించారు. పార్టీ సీనియర్లు తనకు సహకరించట్లేదని రేవంత్ చెప్పినా.. వేణుగోపాల్ పెద్దగా పట్టించుకోలేదు. అందర్నీ కలుపుకోవాల్సిన బాధ్యత పీసీసీపై ఉంటుందని స్పష్టం చేశారు.
రేవంత్ కు ఇప్పుడు అగ్నిపరీక్ష. ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక, మరోవైపు రాహుల్ జోడో యాత్ర.. మరోవైపు పార్టీ లీడర్లందరినీ సమన్వయపరుచుకోవడం.. ఇవన్నీ రేవంత్ ముందున్న సవాళ్లు. సీనియర్ నేతలెవరూ రేవంత్ కు సహకరించేందుకు సిద్ధంగా లేరు. మునుగోడు ఉపఎన్నికలో కీలక పాత్ర పోషించాలని హైకమాండ్ చెప్పినా.. కొంతమంది నేతలు అసలు మునుగోడు మొహమే చూడట్లేదు. మరోవైపు రేవంత్ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు కానీ రాహుల్ గాంధీ పాదయాత్రను పట్టించుకోవట్లేదని కొంతమంది నేతలు ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. పాదయాత్ర రూట్ మ్యాప్ పైన కూడా రేవంత్ కు, పార్టీ నేతలకు మధ్య గ్యాప్ ఉంది. మరి ఈ రెండింటిని రేవంత్ ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.













