పార్టీ పట్టించుకోకపోయినా ప్రభుత్వం రమ్మంటోంది… దటీజ్ ఎన్టీఆర్..!
జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలియని వారుండరు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. తక్కువ కాలంలోనే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. కానీ కుటుంబంలో మాత్రం ఆయన ఇప్పటికీ ఆదరణకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి హరికృష్ణ మరణానంతరం ఎన్టీఆర్ కుటుంబంతో విభేదాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. నందమూరి ఫ్యామిలీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ను, కల్యాణ్ రామ్ ను పక్కనపెట్టినట్టే కనిపిస్తోంది. దీంతో అటు ఫ్యామిలీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని చాలా మంది అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. బాలకృష్ణ సినిమాల్లో ఉన్నా.. సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ జూనియర్ కు మాత్రమే ఉంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి కూడా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు కొత్తకాదు. 2009, 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. ఆ పార్టీని గెలిపించాలని ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత నారా, నందమూరి ఫ్యామిలీలతో గ్యాప్ పెరిగింది.
తండ్రి హరికృష్ణ మరణం తర్వాత ఈ గ్యాప్ మరింత ఎక్కువైంది. దీంతో హరికృష్ణ వారసులకు, మిగిలిన నందమూరి, నారా వారసులకు మధ్య సంబంధాలు పెద్దగా లేవు. ఏదైనా కుటుంబ ఫంక్షన్లలో కలుసుకోవడం, నామమాత్రంగా పలకరించుకోవడం తప్ప క్లోజ్ బాండింగ్ లేకుండా పోయింది. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పార్టీ విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నందమూరి కుటుంబసభ్యులందరూ వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. దీంతో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించకపోవడంపై విమర్శలు గుప్పించారు. కానీ తనను ఆహ్వానించకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా స్పందించలేదు.
అయితే తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోయినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను పట్టించుకుంది. ఖమ్మంలో ఈ నెలాఖరులో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ ను స్వయంగా కలిసి ఈ కార్యక్రమానికి రావాలని కోరారు. 56 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటోంది. నందమూరి కుటుంబీకులను కాదని జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు తెరదీసినట్లయింది.













