తెలంగాణ బీజేపీ ఎందుకు స్లో అయింది..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్నాయి. ఇందుకోసం అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను అనౌన్స్ చేసేసి కార్యక్షేత్రంలోకి దూకింది. నిత్యం అటు ప్రభుత్వ, ఇటు పార్టీ కార్యక్రమాలతో సందడి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నడూ లేనంత ఉత్సాహంతో పరుగులు పెడుతోంది. నిత్యం గాంధీ భవన్ లో సందడి కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. కానీ బీజేపీలో మాత్రం అస్సలు హడావుడి కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంతవరకూ మొదలే కాలేదు. నిన్నమొన్నటి దాకా ఫుల్ హడావుడి చేసిన ఆ పార్టీ ఇప్పుడెందుకు డీలా పడింది?
తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని గత కొంతకాలంగా బీజేపీ చెప్తూ వస్తోంది. కేసీఆర్ ను ఓడించి తాము పగ్గాలు చేపట్టబోతున్నామని ధీమాగా ఉండేది. కర్నాటక తర్వాత దక్షిణ భారతంలో అధికారంలోకి రాబోతున్న రాష్ట్రం తెలంగాణే అని హైకమాండ్ కూడా పలుమార్లు చెప్పింది. కానీ కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత దాని ప్రభావం తెలంగాణలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీలో ఉత్సాహం కనుమరుగైపోయింది. మరోవైపు అదే సమయంలో టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది పార్టీ. దీంతో పార్టీలో ఉత్సాహం మరింత నీరుగారింది.
అయినా పలు కార్యక్రమాలతో బీజేపీ ఎప్పుడూ హడావుడి చేసేది. ఆరు నెలల ముందే ఎన్నికలకోసం వ్యూహరచన చేసిన పార్టీ బీజేపీ. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రవాసీ యోజన పేరుతో కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత మండలాల వారీగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టింది. అనంతరం.. ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రజాప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి రాత్రి నిద్ర చేపట్టింది. అంతేకాక.. ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం చేపట్టి అగ్ర నాయకత్వాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి హడావుడి చేసేది. ఈ హడావుడి చూసి నిజంగానే బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు.
అయితే ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండగా.. బీజేపీలో ఉత్సాహం అస్సలు కనిపించడం లేదు. మిగిలిన పార్టీలు ఇప్పటికే పూర్తిస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుంటే బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టలేదు. దరఖాస్తుల స్వీకరణ మాత్రం చేపట్టింది. అయితే ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలీని పరిస్థితి. మరోవైపు.. నాయకుల హడావుడి కూడా తగ్గిపోయింది. కార్యక్రమాలు కూడా గతంలో ఉన్నంతగా ఇప్పుడు లేవు. అయితే ఎన్నికలు ఒకటి రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు సూచించారని.. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కాస్త హడావుడి తగ్గించిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలను కాస్త వెనక్కు జరిపి.. సార్వత్రిక ఎన్నికలను కాస్త ముందుకు జరిపి.. జనవరి లేదా ఫిబ్రవరిలో పాక్షికంగా జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేంద్రం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.













