తెలంగాణపై బీజేపీ అత్యాశ పడుతోందా..?
తెలంగాణలో ఈసారి కేసీఆర్ సర్కార్ ను ఓడించి తీరాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందుకోసం అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా బలపడేందుకు వ్యూహరచన చేస్తూనే మరోవైపు కేంద్ర బలగాలను ప్రయోగించి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ తాను తగ్గేదే లేదంటోంది టీఆర్ఎస్. అయితే ఎన్ని వ్యూహాలు రచించినా తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదనేమాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి.
తెలంగాణలో బీజేపీకి ఇప్పటికీ కేడర్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పైకి కొంతమంది నేతలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో బీజేపీకి ఇప్పటికీ నాయకత్వలోపం ఉంది. అంతేకాదు.. నియోజకవర్గ స్థాయిలో కూడా బలమైన నేతలు లేరు. 119 నియోజకవర్గాల్లో కేవలం 30-40 స్థానాల్లో మాత్రమే బలమైన నేతలు ఉన్నారని చెప్పొచ్చు. మిగిలిన నియోజకవర్గాల్లో సత్తా ఉన్న నేతలు తక్కువే. కాబట్టి ఈ కేడర్, నేతలతో అధికారంలోకి రావాలనే ఆలోచన సక్సెస్ అవడం అంత ఈజీ కాదు. ఎన్నికల సమయానికి ఇతర పార్టీల్లోని బలమైన నేతలు తమ పార్టీలోకి వస్తారనే ఆలోచనే బీజేపీకి ఎక్కువగా ఉంది. అందుకే చివరి నిమిషం వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తుంటుంది బీజేపీ. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. 30 స్థానాలకు కాస్త అటుఇటుగా మాత్రమే అభ్యర్థులను ప్రకటించగలదు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన కోసం చివరి వరకూ వేచి చూడక తప్పదు.
మరోవైపు తెలంగాణ అధినాయకత్వంలో విభేదాలు కూడా పార్టీకి నష్టం చేకూరుస్తాయని చెప్పొచ్చు. ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చాక ఆయన్ను పార్టీ గట్టిగా ఉపయోగించుకోలేదనే విమర్శలున్నాయి. టీఆర్ఎస్ లోపాలు అణువణువూ తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్. అయితే ఆయన ఎదుగుదలను బీజేపీలోని కొంతమంది సహించలేక ఆయనకు బ్రేక్ వేశారనే ఆరోపణలున్నాయి. ఈటల రాజేందర్ పైకి వస్తే తనకు ఎక్కడ సీఎం సీటు దక్కదో.. అని బండి సంజయ్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మరో నేత వివేక్ కూడా సీఎం సీటు ఆశిస్తున్నారు. వీళ్లు కాకుండా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నేతలు కూడా సీఎం సీటుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. వీళ్లందరూ ఏకతాటి పైకి వచ్చి పనిచేస్తారనే నమ్మకం అస్సలు లేదు. కాబ్టటి ఎవరి దారి వారిదే. ఎవరికి వారు ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారు. పార్టీ బలోపేతానికి ఉమ్మడిగా కృషి చేయట్లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప పార్టీ గురించి ఆలోచించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ తనను తాను ఎక్కువగా ఊహించుకుంది. ఇక తమకు తిరుగులేదని భావించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకుండా ఎవరికి వారు క్రెడిట్ గేమ్ ఆడుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచింది తమవల్లేనని చెప్పుకునేందుకు అందరూ పోటీ పడ్డారు. అలా జరగడం వల్లే మునుగోడులో బోల్తా పడ్డారు. కాబట్టి బీజేపీకి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పే పరిస్థితి అస్సలు లేదు. పైన పటారం లోన లొటారం సామెత బీజేపీకి కరెక్టుగా సరిపోతుంది.













