తెలంగాణలో పునర్వైభవం కోసమే టీడీపీ ఈ ప్లాన్ వేసిందా..?
తెలుగు వారికి జాతీయ రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ స్థాపించిన ఈ ప్రాంతీయపార్టీ జాతీయ స్థాయిలో అనేక సంచలనాలకు వేదిక. ముప్పై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ప్రధాన పార్టీగా ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ ప్రాభవం కోల్పోయింది. కేవలం ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. అయితే ఇప్పుడు మళ్లీ తెలంగాణలో సత్తా చాటాలనుకుంటోంది. పార్టీ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించడం ఇందులో భాగమేననేది విశ్లేషకులు చెప్తున్న మాట.
2014 ముందు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోనో, ప్రతిపక్షంలోనో ఉంటూ వచ్చింది. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ లేని తెలుగు రాజకీయాలను ఊహించుకోలేం. అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీకి మాత్రమే టీడీపీ పరిమితమైపోయింది. 2014లో కొన్ని సీట్లను కైవసం చేసుకున్నా నేతలంతా అధికార పార్టీలో చేరిపోవడంతో పార్టీ ఉనికి లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో గెలిచినప్పుడూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు పార్టీకి కేడర్ లేకుండా పోయింది. పేరుకే మిగిలింది.
అయితే టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ గా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుండడంతో టీడీపీకి తెలంగాణపై మళ్లీ ఆశలు మొలకెత్తాయి. ఇప్పుడు టీడీపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కోల్పోయింది. అందుకే తెలంగాణలో మళ్లీ పట్టు సాధించాలనుకుంటోంది టీడీపీ. వాస్తవానికి టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో అభిమానులున్నారు. క్షేత్రస్థాయిలో ఆదరించే వాళ్లు ఉన్నారు. అయితే నాయకత్వం లోపించడం వల్లే పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమర్థవంతమైన నాయకులు దొరికితే టీడీపీ మళ్లీ గాడిన పడడం ఖాయం.
పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎల్లుండి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. దాదాపు 10వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. ఈ సభ ద్వారా తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టాలనుకుంటోంది. కాసాని జ్ఞానేశ్వర్ కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించిన తర్వాత కేడర్ లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. జ్ఞానేశ్వర్ కూడా చురుగ్గా తిరుగుతూ పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఎంపిక చేసుకున్న జిల్లాల్లో బలోపేతానికి కృషి చేయాలని ప్రాథమికంగా టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.













