తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు డిగ్గీ రాజా సీరియస్ క్లాస్..! వర్కవుట్ అవుతుందా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను పరిష్కరించేందుకు ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. రెండ్రోజులుగా ఇరువర్గాలతో చర్చలు జరిపిన దిగ్విజయ్ సింగ్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారు. వారు చెప్తున్నవాటన్నింటినీ నమోదు చేసుకున్నారు. కేవలం అసంతృప్తుల మీద మాత్రమే కాకుండా ఇతర అంశాలపైన కూడా దిగ్విజయ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అటు రేవంత్, ఇటు సీనియర్ల ఒపీనియన్ తీసుకున్న దిగ్విజయ్ పరిస్థితిని అధిష్టానానికి నివేదించే అవకాశం ఉంది. ఆ తర్వాతే మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇంతకూ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తి కలిగిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. నాయకుల మధ్య విభేదాలను తొలగించేందుకు జంబో పీసీసీ వర్గాన్ని ప్రకటించింది హైకమాండ్. అయితే జంబో కార్యవర్గం తర్వాతే అసంతృప్తులు, అలకలు తారస్థాయికి చేరాయి. బహిరంగంగానే నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందని సీనియర్లు మండిపడ్డారు. కేవలం 13 మందికి మాత్రమే టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారని.. మిగిలిన వాళ్లంతా పాత కాంగ్రెస్ నేతలేనని రేవంత్ వర్గం బదులిచ్చింది. అంతేకాక.. కార్యవర్గంలో స్థానం పొందిన రేవంత్ వర్గీయులంతా రాజీనామాలు చేశారు. దీంతో రచ్చ ముదిరి పాకాన పడింది. అంతేకాక.. కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేది లేదంటూ సీనియర్లు హుకుం జారీ చేశారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగక తప్పలేదు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ప్రస్తుతం మాణిక్కం ఠాగూర్ ఉన్నారు. ఆయన పూర్తిగా రేవంత్ కు వంత పాడుతున్నారనేది సీనియర్లు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. మాణిక్కం ఠాగూర్ కు డబ్బులిచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి తెచ్చుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కానీ మాణిక్కం ఠాగూర్ కానీ, రేవంత్ కానీ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జగ్గారెడ్డి లాంటి నేతలు సైతం మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిని బహిరంగంగానేన పలుమార్లు తప్పుబట్టారు. ఆయన తమ మాటకు విలువ ఇవ్వట్లేదని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసారు. కానీ హైకమాండ్ మాత్రం మాణిక్కం ఠాగూర్ విషయంలో ఎందుకో పెద్దగా చొరవ తీసుకోలేదు. దీంతో సీనియర్లు వర్సెస్ రేవంత్ గా మారిపోయింది వ్యవహారం.
ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. సీనియర్లంతా మాణిక్కం ఠాగూర్ పైనే ఎక్కువగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్ ను వెంటనే తప్పించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆయనతో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వట్లేదని.. ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదని చెప్పినట్టు తెలుస్తోంది. పైగా రేవంత్ వర్గీయులు చెప్పిందే చేస్తున్నారని.. తాము ఏం చెప్పినా పట్టించుకోవట్లేదని డిగ్గీ రాజాకు కంప్లెయింట్ చేసినట్లు సమాచారం. అందరి మాటలనూ విన్న దిగ్విజయ్ సింగ్.. ఎవరూ బహిరంగంగా మీడియా ముందు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని.. ఏదైనా సమస్య ఉంటే మీటింగ్ పెట్టుకుని చర్చించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కచ్చితంగా నేతలంతా ఏకతాటి పైకి రావాలని.. ఇకపై ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏవైన ఇబ్బందులు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని.. పార్టీలో సీనియర్, జూనియర్ అనే తేడాలు ఉండవని చెప్పినట్లు సమాచారం. మరి డిగ్గీ రాజా క్లాస్ వర్కవుట్ అయిందో లేదో కొన్నాళ్లు వేచి చూస్తే కానీ తెలీదు.













