తెలంగాణ కాంగ్రెస్ ను కమలం పార్టీ ఖాళీ చేయబోతోందా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కూరుకుపోతోంది. మొదటి నుంచి ఆ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువ. సీనియర్ లీడర్ల మధ్య గ్యాప్ విపరీతంగా ఉంది. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బహిరంగంగానే రేవంత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు సీనియర్ నేతలు. పార్టీ హైకమాండ్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. దీంతో పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు కమలం పార్టీ కాచుకుని కూర్చున్నట్టు ఉంది.
తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కాంగ్రెస్సే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్రాన్ని విభజిస్తే ఏపీలో పార్టీ కనుమరుగైపోతుందని సోనియాకు తెలుసు. అయినా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ కలను నెరవేర్చింది సోనియా. అయితే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. అదే సమయంలో పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికార బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష స్ధానం కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతూ వస్తోంది.
రెండోసారి కూడా అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్ మరింత పతనమైంది. అదే సమయంలో కేంద్రంలో అధికారం అండగా ఉండడంతో తెలంగాణలో బీజేపీ రెచ్చిపోయింది. దూకుడు పెంచి హడావుడి చేయడం మొదలు పెట్టింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోనో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లోనే కాంగ్రెస్ నేతలు చేరిపోవడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం, సీనియర్ నాయకుల పెత్తనం, రేవంత్ రెడ్డి లాంటి నాయకులకు పీసీసీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోవడం లాంటి అనేక అంశాలు ఆ పార్టీని మరింత దిగజార్చాయి.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ఫోకస్ తగ్గింది. బీజేపీని ఎదుర్కోవడంపైనే ఆయన దృష్టి పెట్టారు. దీంతో కమలం పార్టీ నేతలు కాంగ్రెస్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీలోని కీలక నేతలను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టులేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే కాంగ్రెస్ నాయకత్వాన్ని లాక్కో గలిగితే గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతమవుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. త్వరలోనే మరికొంతమంది నేతలు కూడా కమలం కండువా కప్పుకోవడం ఖాయమని చెప్తున్నారు.













