షర్మిలకు వ్యతిరేకంగా ఏకమవుతున్న కాంగ్రెస్ నేతలు..!
కాంగ్రెస్ పార్టీ అంటేనే విభేదాలు తారస్థాయిలో ఉంటాయనే పేరుంది. దానికి తగ్గట్టే ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా. ఎన్నికలు సమీపిస్తున్నాయి. నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన సమయం ఇది. అయినా నేతల మధ్య సమన్వయ లోపం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నేతలందరూ తమకు నచ్చినట్లు నడుచుకుంటూ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల వ్యవహారం మరింత ఇబ్బందికరంగా మారింది. షర్మిల విషయంలో నేతల మధ్య విభేదాలు వెలుగుచూశాయి. ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు నేతలు ఏకమవుతున్నారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వై.ఎస్. షర్మిలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రాజశేఖర రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ వాదేనని.. ఆయనపై తమకు అపారమైన గౌరవం ఉందని సోనియా, రాహుల్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వై.ఎస్. పేరును వాడుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఏపీలో ఇది పార్టీకి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. అందుకే షర్మిల తన పార్టీని విలీనం చేస్తానంటే కాదనకుండా ఓకే చెప్పారు. ఇంతవరకూ ఓకే.. కానీ ఆమెను తెలంగాణలో వాడుకునేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజలు, నాయకులు ఆదరిస్తారని భావించారు. అయితే రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకిగా ఉండడం షర్మిలకు శాపంగా మారింది. అందుకే ఆమె వెంట నడిచేందుకు తెలంగాణ వాళ్లెవరూ ముందుకు రాలేదు. అందుకే ఆమె పార్టీని రెండేళ్లకే విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. విలీనం చేసిన తర్వాత పార్టీ తనకు అండగా నిలుస్తుందని ఆమె భావించారు. హైకమాండ్ షర్మిలకు అండగా ఉంటున్నా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెవైపు నిలిచేందుకు అస్సలు అంగీకరించడం లేదు. ఆమె తెలంగాణలో ఉంటే పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని తేల్చి చెప్తున్నారు.
ముఖ్యంగా పాలేరులో షర్మిల పోటీ చేసే విషయంలో టీ కాంగ్రెస్ నేతలందరూ ససేమిరా అంటున్నారు. తుమ్మల నాగేశ్వర రావును పార్టీలోకి తీసుకొచ్చి పాలేరు నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. తాజాగా రేణుకా చౌదరి కూడా తుమ్మలకే జైకొడుతున్నారు. తనకు పాలేరు టికెట్ పై హామీ ఇస్తేనే పార్టీలోకి వస్తానని తుమ్మల స్పష్టం చేశారు. మరోవైపు షర్మిల కూడా పాలేరు టికెట్ కోసమే పట్టుబడుతున్నారు. అయితే షర్మిలకు చెక్ పెట్టేందుకు తుమ్మలను తెరపైకి తెచ్చి పావులు కదుపుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. మరి ఈ వివాదానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













