షర్మిల బాణాలు ఎందుకు గురి తప్పుతున్నాయి?
తెలంగాణలో సత్తా చాటాలని, ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకురావాలనే ధ్యేయంతో పార్టీ స్థాపించారు షర్మిల. తండ్రి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, తన మెట్టినిల్లు ఇదేనని చెప్పుకుంటున్నారు. అందుకే తెలంగాణను పాలించే అన్ని అర్హతలు తనకు ఉన్నాయంటున్నారు. ఇందులో తప్పేం లేదు. ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలు ఆదరిస్తే ఎవరు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు. ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. ప్రజలు కరుణిస్తే పాలించొచ్చు. షర్మిల కూడా అదే ఉద్దేశంతో తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారు. అయితే ఆమె వేస్తున్న అడుగులు మాత్రం షర్మిలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. ఇది తెలంగాణలో పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. దీనిపై విపక్షాలన్నీ చాలా సీరియస్ గా ఉన్నాయి. షర్మిల కూడా ఈ అంశంపై ఉమ్మడిగా పోరాడదామని విపక్షాలకు పిలుపునిచ్చారు. వాళ్లు కలసిరాకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగారు. సిట్ దగ్గరకు వెళ్లేందుకు నిన్న షర్మిల బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై ఆగ్రహించిన షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లపై వాహనాన్ని పోనివ్వాలని డ్రైవర్ కు ఆదేశాలిచ్చారు. షర్మిల వ్యవహరించిన తీరుపై పోలీసులతోపాటు జనం కూడా ఆశ్చర్యపోయారు.
ఇక్కడే కాదు.. గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా షర్మిల దూకుడు పెద్ద దుమారమే రేపింది. స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకున్న షర్మిల చేసిన కామెంట్స్ ఆమెను అరెస్టు వరకూ తీసుకెళ్లాయి. పాదయాత్ర మధ్యలోనే ఆపేసేలా చేశాయి. షర్మిల మాటలకు ఆగ్రహించిన స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు. తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వెళ్లినప్పుడు కూడా షర్మిల ఆవేశం అనేక విమర్శలకు తావిచ్చింది. వాహనాన్ని పోలీసులు ఈడ్చుకెళ్లినా ఆమె మాత్రం దాన్ని దిగలేదు. పైగా పోలీసులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
రాజకీయ నాయకులకు సంయమనం చాలా అవసరం. తెలంగాణలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఆవేశపరులే. కానీ షర్మిల లాగా ఎప్పుడూ నోరు జారరు. అధికారులు, పోలీసులతో వాళ్లు వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. షర్మిల లాగే వాళ్లను కూడా పలు సందర్భాల్లో పోలీసులు అడ్డుకున్నారు. కానీ షర్మిల లాగా ఎప్పుడూ వాళ్లు ఇలా ప్రవర్తించలేదు. విమర్శలు ఎదుర్కోలేరు. కానీ షర్మిల దురుసుతనం మాత్రం అనేక విమర్శలకు తావిస్తోంది. ఆమె ఆవేశం కంటే ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.













