కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం కాబోతోందా..?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని మాటిచ్చి పార్టీ పెట్టారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల. వైస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ఆమె తెలంగాణ మొత్తం పాదయాత్ర చేశారు. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం ఆమె ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె ఆశించిన మైలేజ్ రాలేదు. ఎంతో కష్టపడి రాష్ట్రంలో ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వివిధ కాంట్రవర్సీలకు కారణమయ్యారు. అయినా ఆమె వెంట వచ్చే నాయకులు లేకుండా పోయారు. దీంతో పార్టీని ఏం చేయాలో.. ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థంకాని డైలమాలో పడిపోయారు షర్మిల.
అయితే ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సొంతంగా పార్టీని నడపడం సాధ్యం కాదని షర్మిలకు ఇప్పటికే అర్థమైనట్టుంది. ఎందుకంటే ఎంత ఖర్చు చేసినా పార్టీ జనాల్లోకి వెళ్లట్లేదు. జనం నుంచి స్పందన రావట్లేదు. పైగా నాయకులు కూడా తన వెంట నడిచేందుకు ఎవరూ సుముఖంగా లేరు. రాజశేఖర రెడ్డి పేరు ఎంత వాడుకోవాలని చూస్తున్నా పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. అందుకే పార్టీని వీడలేక, దాన్ని ముందుకు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు షర్మిల. అందుకే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా కనీసం తనవరకైనా రాజకీయాల్లో ఓ స్థానం సంపాదించుకునేందుకు అవకాశం కలుగుతుందని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా షర్మిల తన పార్టీ కార్యకలాపాలను వాయిదా వేసినట్టు అర్థమవుతోంది. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇదే సమయంలో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను రెండు సార్లు భేటీ కావడం సంచలనం కలిగించింది. డీకే శివకుమార్ ద్వారా ఆమె కాంగ్రెస్ లో లైన్ క్లియర్ చేసుకుందనే వార్తలు వినిపించాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో షర్మిల పొత్తు పెట్టుకోవాలని భావించారు. అప్పుడు కొన్ని సీట్లు తీసుకోవడం ద్వారా బలమైన పోటీ ఇవ్వడమే కాక, కొన్ని స్థానాల్లో నెగ్గేందుకు అవకాశం ఉంటుందని షర్మిల భావించారు. అయితే పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అన్నట్టు సమాచారం. విలీనం చేస్తేనే ముందుకు వెళ్దామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేస్తే షర్మిల కోరుకున్న సీటును ఇస్తామని హస్తం పార్టీ హైకమాండ్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసేందుకు షర్మిల ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ విలీనానికి దాదాపు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా ఆయనకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు షర్మిల. దీంతో విలీనంపై ఊహాగనాలు మరింత బలపడ్డాయి. అయితే షర్మిల పార్టీని తమలో కలుపుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. మరి ఇలాంటప్పుడు విలీనం అవుతుందా.. కాదా.. అనే టెన్షన్ కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.













