వరాల వర్షం కురిపిస్తున్న రేవంత్ రెడ్డి.. మేనిఫెస్టోలో చోటు దక్కుతుందా..?
తెలంగాణలో అధికారంకోసం మూడు ప్రధాన పార్టీలు ఈసారి పోటీ పడబోతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఈసారి తమదే అధికారం అని ప్రకటిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా రేసులో నిలిచేందుకు తీవ్రంగానే శ్రమిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత పార్టీలో కాస్త ఊపు వచ్చింది. జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్రలు చేస్తున్నాయి. తెలంగాణలో కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అటెన్షన్ డ్రా చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి మాస్ లీడర్. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. జనాలను తన దగ్గరకు రప్పించుకోవడంలో నేర్పరి. ఇప్పుడు యాత్రలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి ఎక్కడలేని ఉత్సాహం వస్తోంది. అధికార బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. పదునైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు జరుగుతున్న దాన్ని పోల్చుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తున్నామో విడమర్చి చెప్తున్నారు. దీంతో మిగిలిన పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిందని అందరూ అనుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రజల నాడిని పట్టుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ ఓ తరానికి కాంగ్రెస్ అంటే ఇందిరమ్మే. అందుకే తాను ఇందిరమ్మ మనవడినని.. తనను చూసి ఓటేయాలని.. తెలంగాణ రూపురేఖలు మార్చుతానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని చెప్తున్నారు. అంతేకాక అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యువతకు 2 లక్షల ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని మాటిచ్చారు. భద్రాచలంలో పర్యటించినప్పుడు భద్రాద్రి ఆలయాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాక ప్రతి నియోజకవర్గంలో పదికోట్లతో రామాలయాలను నిర్మిస్తామన్నారు. ఒక్కో చేనేత కుటుంబానికి 5 లక్షల గ్రాంటు మంజూరు చేస్తామన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేయడం కత్తిమీద సామే. పార్టీలో నేతలందరూ ఒక్కతాటి పైకి రారు. పైగా నిత్య వివాదాలు.. విభేదాలతో రోడ్డున పడుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు మినహాయింపు కాదు. రేవంత్ రెడ్డికి సీనియర్లు అస్సలు సహకరించట్లేదు. అయినా రేవంత్ రెడ్డి ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. తానే మేనిఫెస్టో డిసైడ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మరి రేవంత్ రెడ్డి హామీలకు మేనిఫెస్టోలో చోటు దక్కుతుందా.. లేకుంటే చివరి నిమిషంలో మారుతాయా.. అనేది వేచి చూడాలి.













