టీడీపీలో చేరికపై రాజా సింగ్ క్లారిటీ..! బీజేపీ సస్పెన్షన్ ఎత్తేస్తుందా..?
తెలంగాణలో బీజేపీ తరపున గట్టి వాయిస్ వినిపించే వాళ్లలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. ఘోషా మహల్ నుంచి రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఇక్కడి నుంచి ఈసారి కూడా బరిలోకి దిగి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు రాజా సింగ్. అయితే రెండ్రోజుల నుంచి రాజా సింగ్ బీజేపీని వదిలేసి టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో రాజా సింగ్ భేటీ అయ్యారని.. త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీలో టెన్షన్ నెలకొంది. టీడీపీలో మాత్రం జోష్ కనిపిస్తోంది.
అయితే తాను టీడీపీలో చేరబోవట్లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. తన మైండ్ సెట్ కు బీజేపీ తప్ప మరో పార్టీ సెట్ కాదని తేల్చేశారు. అందుకే తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తనపై బీజేపీ విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ తరపునే ఘోషా మహల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. దీంతో రెండ్రోజుల నుంచి వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్లయింది. ఘోషా మహల్ తో పాటు మరో మూడు నియోజకవర్గాల బాధ్యతను కూడా తాను తీసుకుంటానని టీడీపీ అధిష్టానంతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రాజాసింగ్ రాజకీయ ప్రవేశం టీడీపీతోనే మొదలైంది. టీడీపీ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఆయన బీజపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.
రాజా సింగ్ పై బీజేపీ నిషేధం విధించి ఆరు నెలలు దాటిపోయింది. స్టాండప్ కమెడియన్ కు వ్యతిరేకంగా మహ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ రాజా సింగ్ పెట్టిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన బీజేపీ అధిష్టానం.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన రాజా సింగ్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తేస్తుందని రాజా సింగ్ ఆశాభావంతో ఉన్నారు. అయితే ఆరు నెలలు దాటినా ఇప్పటివరకూ ఎత్తేయకపోవడంపై రాజా సింగ్ అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారాలని సూచిస్తున్నారు. అయితే రాజా సింగ్ మనసు మాత్రం బీజేపీతోనే ఉంది. ఇప్పుడు టీడీపీలో చేరికపై రాజా సింగ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారానికి ఇప్పటితో ముగింపు పడినట్లేనని భావిస్తున్నారు. అయితే ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుని బీజేపీ తనకు టికెట్ ఇస్తుందని రాజా సింగ్ భావిస్తున్నారు. ఒకవేళ అప్పటికీ సస్పెషన్ ఎత్తేయకుండా, టికెట్ ఇవ్వకుండా నిరాకరించినట్లయితే టీడీపీ తరపున రాజా సింగ్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.













