తెలంగాణలో ‘టీఆర్ఎస్’ పేరుతో కొత్త పార్టీ..!?
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోందా..? ఒక జాతీయ పార్టీ కనుసన్నల్లోనే అది రూపుదిద్దుకోబోతోందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ సహా పలు పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా తలపడాలని భావిస్తున్న పార్టీలు. ఈ రేసులోకి మరో పార్టీ కూడా త్వరలో చేరబోతోందనే సమాచారం అందుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి త్వరలోనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలో కీలక నేత. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన కొంతకాలం తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పొంగులేటికి సీటు ఇవ్వలేదు కేసీఆర్. అయినా అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే ఖమ్మం జిల్లాలో తనకు ప్రాధాన్యత లేకపోవడం, తన అనుచరులపై కక్ష సాధింపు చర్యలు.. లాంటి వాటిని భరిస్తూ వచ్చిన పొంగులేటి ఇక పార్టీలో ఇమడలేనని తేల్చేశారు. అందుకే పార్టీ నుంచి బయటికొచ్చారు.
అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డిని లాక్కోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో శ్రమించారు. ఒకానొక దశలో పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయమైందని వార్తలొచ్చాయి. ఢిల్లీ వెళ్లారని, బీజేపీ హైకమాండ్ ను కలిశారని.. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభరోజే ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే అది జరగలేదు. పొంగులేటి కూడా మౌనంగా ఉండిపోయారు. అదే సమయంలో ఆయన షర్మిలను, విజయమ్మను కలిశారని., దీంతో ఆయన వైఎస్ఆర్టీపీలో జాయిన్ అవుతారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత పొంగులేటి విజయవాడ వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. దీంతో ఆయన మళ్లీ వైఎస్సాసీపీ తరపున తెలంగాణలో పని చేస్తారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కాదని.. త్వరలో ఆయన పార్టీ పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
పొంగులేటికి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సొంత బలగం ఉన్న నేత. అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెడతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పొంగులేటికి అనుచరగణం ఉంది. అందుకే సొంత పార్టీ పెట్టి ఈ ప్రాంతంపై పట్టు సాధించగలిగితే తామే కింగ్ మేకర్ కావచ్చొనే ఆలోచన పొంగులేటికి ఉన్నట్టు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని వదిలేసి భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పొంగులేటి తెలంగాణ రైతు పార్టీ పేరుతో TRS ఏర్పాటు చేయబోతున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే పొంగులేటి పార్టీ వెనుక బీజేపీ ఉందనే వాదన కూడా ఉంది. ఇలాంటి చిన్న చిన్న పార్టీలను ఏర్పాటు చేయించి ఓట్లు చీల్చి లబ్ది పొందడంలో బీజేపీది అందెవేసిన చేయి. ఇప్పుడు పొంగులేటితో కూడా తెలంగాణలో అలాంటి ప్రయోగమే చేయబోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో..!













