పొంగులేటి, జూపల్లికోసం నల్లారి, సునీల్ కనుగోలు చివరి ప్రయత్నాలు..!!
తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనేదానిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. దీంతో వాళ్లను తమతమ పార్టీల్లో చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వాళ్లిద్దరూ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తుండడంతో బీజేపీ చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ ఈటల రాజేందర్ వాళ్లకోసం అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే ఆయన చేతులెత్తేయడంతో కొత్త వ్యక్తి రంగంలోకి దిగారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మిగిలిన పార్టీల్లోని నాయకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా ఉన్న బలమైన నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుకోసం కాంగ్రెస్, బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ వీళ్లిద్దరికోసం రెండు పార్టీలు నెలల తరబడి ట్రై చేస్తున్నాయి. అయితే వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపే వాళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి, జూపల్లి చాలాకాలమే తీసుకున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు బీజేపీ కంటే కాంగ్రెస్సే బెటర్ అనే అభిప్రాయానికి ఇద్దరు నేతలు వచ్చారు. ముఖ్యంగా తమ సొంత జిల్లాలైన ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాష్ట్ర స్థాయి లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాతే హస్తం గూటికి చేరేందుకు ఓకే చెప్పారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ సలహాదారు సునీల్ కనుగోలు ఇటీవల పొంగులేటి, జూపల్లితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆయా జిల్లాల్లో వాళ్లు అడుగుతున్న సీట్లు, వాటిలో పోటీ చేసే అభ్యర్థులపైన కూడా మంతనాలు జరిపారు. సునీల్ కనుగోలు సూచనలు, పొంగులేటి, జూపల్లి అభ్యర్థనలు.. అన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించిన తర్వాతే చేరికకు గ్రీన్ సిగ్నల్ రెండువైపుల నుంచి లభించింది.
అయితే బీజేపీ ఇంకా తమ ప్రయత్నాలు ఆపలేదు. ఈటల రాజేందర్ చేతులెత్తేయడంతో చివరి ప్రయత్నాలు చేయాల్సిందిగా ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపింది బీజేపీ హైకమాండ్. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపారు. ఈ ఇద్దరు నేతలతో కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సాన్నిహిత్యంతో వాళ్లతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో చేరొద్దని, బీజేపీలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈటలకు సంధించిన ప్రశ్నలనే నల్లారికి కూడా సంధించారు పొంగులేటి, జూపల్లి. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని తేల్చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా సమాధానాలు లేవు. దీంతో ఆయన వాళ్లిద్దరినీ కన్వీన్స్ చేయలేకపోయారు. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుసు సిద్ధమయ్యారు.













