కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి..! మే మొదటివారంలో ప్రియాంక సమక్షంలో చేరిక..!!
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ వీళ్లను సస్పెండ్ చేయడంతో వీళ్లు ఏ పార్టీలో చేరతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. స్వతహాగానే బలమైన నాయకులు కావడంతో వీళ్లను పార్టీలోకి రావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే వీళ్లిద్దరూ మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. తాము చెప్పినట్లు నడుచుకుంటూ, తాము అడిగిన సీట్లు ఇచ్చే పార్టీలో చేరాలనేది వీళ్ల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలో కీలక నేత. జిల్లావ్యాప్తంగా పట్టున్న నేత. ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా ఈసారి బీఆర్ఎస్ దక్కనివ్వబోనని శపథం చేశారు పొంగులేటి. అయితే అలా జరగాలంటే తాను చెప్పిన వాళ్లకే సీట్లిచ్చే పార్టీ కావాలి. అప్పుడు జిల్లాలో ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని, అందరినీ గెలిపించుకుంటానని చెప్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావుకు మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. కొల్లాపూర్ లో తన అనుచరులు రెబెల్ గా పోటీ చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనతో పాటు తన అనుచరులను గెలిపించుకోవాలనే పట్టుదలతో కృష్ణారావు ఉన్నారు. తాను చెప్పిన వాళ్లకు సీట్లిచ్చే పార్టీలో చేరాలనుకుంటున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. ఇద్దరికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. పొంగులేటిని షర్మిల కూడా తన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే వీళ్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీలో చేరితే తమకు ఎక్కువ లబ్ది చేకూరుతుందో బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఇంతకాలం వీళ్లిద్దరూ ఎవరికివారు మంతనాలు జరుపుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇద్దరూ ఏకతాటి పైకి వచ్చి కార్యాచరణ ప్రకటించారు. ఉమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనాలు చేపడుతున్నారు. అంతేకాక ఇద్దరూ ఒకే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వీళ్లను లాక్కొనేందుకు గట్టిగా ట్రై చేస్తోంది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డిని తమ పార్టీలోకి చేరాల్సిందిగా రాహుల్ గాంధీ వర్తమానం పంపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధిలు పొంగులేటిని కలిసి రాహుల్ గాందీ సందేశాన్ని తెలియజేశారు. అంతేకాక భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మినహా.. మిగిలిన అన్ని సీట్లనూ పొంగులేటి చెప్పినట్లు ఇచ్చేందుకు పార్టీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలిసింది. అలాగే జూపల్లితో కూడా మంతనాలు జరపాలని పొంగులేటికే సూచించినట్లు సమాచారం. దీంతో వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది. మరోవైపు వీళ్లిద్దరి చేరికపై ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. రేణుకా చౌదరి నివాసంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. వీళ్లిద్దరూ ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్ లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. ఆ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఆ సమావేశంలోనే వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.













