మునుగోడులో టీఆర్ఎస్కు టెన్షన్..! బీజేపీలో జోష్..!! ఎందుకు.. ఎలా..?
మునుగోడు బైపోల్ కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. 14వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు 17వ తేదీ వరకూ గడువుంటుంది. ఇక నవంబర్ 3న ఎన్నిక జరుగుతుంది. 6వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దూకేశాయి. ఇన్నాళ్లూ అభ్యర్థిని ప్రకటించని టీఆర్ఎస్ ఇవాళ కేండిడేట్ ను సెలెక్ట్ చేసి గోదాలోకి దింపింది. బీజేపీ, కాంగ్రెస్ ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో మునిగిపోయాయి. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కు ఒక టెన్షన్ నెలకొంది. అది బీజేపీలో జోష్ తీసుకొస్తోంది.
ఉపఎన్నికలు ఒకప్పుడు టీఆర్ఎస్ కు వరం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు ఉపఎన్నికలకు వెళ్లారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉపఎన్నికల్లో సత్తా చాటడంలో కేసీఆర్ కు తిరుగులేదు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపఎన్నికలు ఆ పార్టీకి పెద్దగా కలసిరాలేదనే చెప్పాలి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందింది. ఈ రెండు ఎన్నికలు బీజేపీకి పెద్ద బూస్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు. అప్పటి నుంచి బీజేపీ దూకుడు మరింత పెంచింది. ఇది టీఆర్ఎస్ కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
అయితే మునుగోడు బైపోల్ లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారనే విషయాన్ని పక్కన పెడితే ఒక అంశం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఇది బీజేపీకి ఆనందం కలిగిస్తుండగా.. టీఆర్ఎస్ ను కాస్త టెన్షన్ కు గురి చేస్తోంది. నవంబర్ నెలలో ఎప్పుడు బైపోల్ వచ్చినా తమదే విజయమని బీజేపీ నమ్ముతోంది. గతంలో జరిగిన బైపోల్స్ ఇదే విషయాన్ని రుజువు చేశాయని.. ఇప్పుడు కూడా అదే జరిగి తీరుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలకు, నవంబర్ నెలకు లింక్ ఉంది. అందుకే బీజేపీ ఈ సెంటిమెంట్ ను నమ్ముతోంది.
దుబ్బాక ఉపఎన్నిక 2020లో జరిగింది. ఆ ఏడాది నవంబర్ 3న పోలింగ్ జరగగా.. పదో తేదీన కౌంటింగ్ జరిగింది. బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందన్ ఈ ఎన్నికలో గెలుపొందారు. అలాగే.. హుజూరాబాద్ ఉపఎన్నిక 2021 అక్టోబర్ 30న జరగగా.. కౌంటింగ్ నవంబర్ 2వ తేదీ జరిగింది. పోలింగ్ అక్టోబర్ లో జరిగినా కౌంటింగ్ నవంబర్ నెలలో జరిగింది. ఈ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. నవంబర్ నెలలో కౌంటింగ్ జరిగిన ఈ రెండు ఎన్నికల్లో తాము గెలుపొందాం కాబట్టి ఇదే సెంటిమెంట్ మునుగోడులో వర్కవుట్ అవుతుందని.. గెలుపు తమదేనని బీజేపీ భావిస్తోంది.
ఇక టీఆర్ఎస్ మాత్రం ఇలాంటి సెంటిమెంట్ ను తిరగరాస్తామంటోంది. నవంబర్ సెంటిమెంట్ మునుగోడులో వర్కవుట్ కాదని చెప్తోంది. మునుగోడులో బీజేపీకి అంత సీన్ లేదని.. 6వ తేదీ కౌంటింగ్ రోజు ఈ విషయం అర్థమవుతుందని గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. మరి నవంబర్ సెంటిమెంట్ బీజేపీకి కలిసొస్తుందో.. టీఆర్ఎస్ ను గట్టెక్కిస్తుందో చూద్దాం..













