తగ్గేదేలే అంటున్న పార్టీలు..! మునుగోడులో ‘నోట్ల’ పండగ..!!
మునుగోడు ఉప ఎన్నికకు ఇంకో 20 రోజులు సమయం ఉంది. నెల రోజుల ముందు నుంచే ఇక్కడ పార్టీలు తిష్ట వేశాయి. జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలవడం.. మూడూ బలంగా ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు డబ్బు, మద్యం భారీగా పంచుతున్నాయి. మూడు పార్టీల నుంచి వస్తున్న ఆఫర్లతో మునుగోడు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. దసరా రోజు మొదలైన నోట్ల పండగ ప్రతిరోజూ కొనసాగుతోంది. పార్టీలు డబ్బు కుమ్మరిస్తుండడంతో దేశంలోనే ఇది ఖరీదైన ఎన్నిక కాబోతోందనే సమాచారం అందుతోంది.
మునుగోడులో ఓట్లకోసం పార్టీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. ఓటర్లను సెగ్మెంట్లవారీగా విభజించుకుని వారిని ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. సామాజికవర్గాల వారీగా మందు, డబ్బు.. ఇలా పంచేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. డబ్బు నేరుగా పంచేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నేతలు.. గూగుల్ పే, ఫోన్ పే చేస్తున్నాయి. అంతేకాదు.. ఎక్కువ ఓటర్లు ఉన్న కుటుంబాలకు చెక్కులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయా పార్టీలు తమ స్థోమతకు తగ్గట్టు ఓటుకు వెల కడుతున్నాయి. ఒక్కో ఓటుకు కనిష్టంగా పది వేల నుంచి గరిష్టంగా ముప్పై వేల వరకూ ధర పలుకుతోందనే సమాచారం అందుతోంది. ఇక మందు, బిర్యానీ అదనం. 20 రోజుల ముందు నుంచే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఎన్నికల నాటికి సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఓటర్లను ఆకట్టుకోవడంలో బీజేపీ, టీఆర్ఎస్ ముందున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలూ భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బైపోల్ ను ఈ రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దీంతో ఎక్కడా తగ్గట్లేదు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. డబ్బును నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. గతంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక్కో పార్టీ కనీసం వంద కోట్లు ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. ఆ లెక్కన మూడు ప్రధాన పార్టీల ఖర్చూ కలిపితే 3వందల కోట్ల పైమాటే. ఒక అసెంబ్లీ స్థానానికి.. అది కూడా ఏడాది మాత్రమే సమయం ఉన్న ఓ సీటుకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మునుగోడు ఖరీదైన ఎన్నిక జాబితాలో మొదటి స్థానంలో చేరుతుందని అంచనా.
మునుగోడుకు డబ్బు తరలించేందుకు పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి. మరోవైపు పోలీసుల తనిఖీల్లో పెద్దఎత్తున డబ్బు పట్టుబడుతోంది. హైదరాబాద్ లో వారం రోజుల్లోనే 10కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఇదంతా మునుగోడుకు వెళ్తున్న సొమ్మేనని అనుమానిస్తున్నారు పోలీసులు. ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్తోంది.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మునుగోడు ప్రజలు మాత్రం పండగ చేసుకుంటున్నారు. తమ జీవితంలో ఎన్నడూ చూడని నోట్ల పండగ ఇది.













