వెంటపడి ఓడిస్తానన్న కవిత.. దమ్ముంటే పోటీ చెయ్.. అన్న అర్వింద్..!
తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ – బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎంపీ అర్వింద్ – ఎమ్మెల్సీ కవిత మధ్య మొదలైన మాటలతూటాలు రెండు పార్టీల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవిత కుమార్తె కవిత … మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరుతానని చెప్పినట్టు బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన కామెంట్స్ ఆ రెండు పార్టీల మధ్య ఉద్రికతలకు కారణమయ్యాయి. అర్వింద్ చేసిన కామెంట్స్ పై కవిత సీరియస్ గా స్పందించారు. అంతేకాదు.. టీఆర్ఎస్ శ్రేణులు అర్వింద్ ఇంటిపై దాడులకు దిగాయి. దీంతో బీజేపీ శ్రేణులు కూడా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. అర్వింద్ కామెంట్స్ ను ఖండిస్తూ కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అర్వింద్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంకోసారి బరితెగించి మాట్లాడితే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ ప్రవర్తన నిజామాబాద్ కే అవమానకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అర్వింద్ యాక్సిడెంటల్ గా ఎంపీ అయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటపడి ఓడిస్తానని శపథం చేశారు. అర్వింద్ రాజస్థాన్ లోని ఓ ఫేక్ యూనివర్సిటీలో చదివాడన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
తెలంగాణలో కూడా ఏక్ నాథ్ షిండే తరహా ట్యాక్టిక్స్ ప్రయోగించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తనను బీజేపీ అనుకూల నేతలు కొందరు సంప్రదించిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. లిక్కర్ కేసుకు వారం రోజుల ముందు తనను నేతలు సంప్రదించారని చెప్పారు. వారి వివరాలు వెల్లడించాలనుకోవట్లేదని కవిత చెప్పారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశాయి. ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశాయి. ఆ సమయంలో అర్వింద్ ఇంట్లో లేరు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కవితపై మాటల దాడి చేశారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తే తన ఇంటిపై దాడి చేస్తారా.. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. కుల దురహంకారంతో కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కవితకు దమ్ముంటే ఈసారి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. నాడు తనపై పోటీ చేసిన పసుపు రైతుల్లో చాలా మంది ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారని చెప్పారు అర్వింద్. అంతేకాక.. కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారంటూ తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. ఆ పార్టీ ఆఫీస్ బేరరే తనకు ఈ విషయం వెల్లడించినట్లు తెలిపారు.
అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ నేతలందరూ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడిని ఖండించారు. టీఆర్ఎస్ దాడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పలువురు బీజేవైఎం కార్యకరత్లు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ముట్టడికి బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నించవచ్చనే సంకేతాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయం వద్ద కూడా భద్రత పెంచారు. మొత్తానికి అర్వింద్ – కవితల మధ్య మాటల తూటాలు రెండు పార్టీల మధ్య అగ్గి రాజేశాయి.













