8న తెలంగాణకు ప్రధాని మోదీ..! బీఆర్ఎస్తో ఫైట్ తారస్థాయికి చేరినట్టేనా?
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వార్ తారస్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అంతేకాక, పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగసభలో కూడా మోదీ పాల్గొంటారు. ప్రధాని ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతారా.. లేకుంటా పార్టీ పరంగా ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు పార్టీల గురించి అస్సలు మాట్లాడరు మోదీ. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ను కచ్చితంగా పాటిస్తారు. అదే పార్టీ వేదికలపై మాత్రం విపక్షాలను టార్గెట్ గా చేసుకుని నిప్పులు చెరుగుతారు. ఇప్పుడు తెలంగాణ పర్యటనలో కూడా మొదట ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు మోదీ. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం.. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్- మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2కు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎయిమ్స్ తో పాటు 6 జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారు.
ఈ కార్యక్రమాల అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఇక్కడ మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మోదీని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అదానీ – మోదీ సంబంధాలపై బీఆర్ఎస్ పెద్దఎత్తున ఆరోపణలు చేస్తోంది. మోదీని టార్గెట్ చేసుకుని ఇతర విపక్షాలతో కలిసి పోరాడుతోంది. మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనే ఓ వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారు. దీంతో మోదీ ఎలా రియాక్ట్ అవుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తనపై కేసీఆర్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే కవిత కేసును ఎత్తి చూపుతారని అందరా భావిస్తున్నారు. తెలంగాణలో ఇకపై మోదీ, అమిత్ షా రెగ్యులర్ గా పర్యటిస్తారని తెలుస్తోంది. కర్నాటక తర్వాత తెలంగాణనే బీజేపీ టార్గెట్ అని చెప్తున్నారు.













