ఫామ్ హౌజ్ నిందితులకు బెయిల్..! బి.ఎల్.సంతోషే కీలక సూత్రధారి అన్న సిట్..!!
ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటకు రావడంతో తెలంగాణలో కలకలం రేగింది. అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా మరో మలుపు తీసుకుంది. ఫామ్ హౌజ్ డీల్స్ వెనుక బీజేపీ ముఖ్యనేత బి.ఎల్.సంతోష్ ముఖ్య పాత్ర వహించారని సిట్ హైకోర్టుకు తెలిపింది. బి.ఎల్. సంతోష్ ఇంట్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు మంత్రాంగమంతా జరిగిందని వివరించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు బెయిల్ లభించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచుతున్న కొద్దీ తెలంగాణలో సిట్ కూడా స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. ఇందులో బీజేపీ కీలక నేత బి.ఎల్.సంతోష్ కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఆయన ఇంట్లోనే కుట్రకు సంబంధించిన కీలక సమావేశం జరిగిందని సిట్ నివేదికలో తెలిపింది. ఆ సమావేశానికి సంబంధించిన ఆధారాలను కూడా హైకోర్టుకు సమర్పించింది. అక్టోబర్ 15న ఢిల్లీ ప్రభుత్వ క్వార్టర్ లో ఈ చర్చలు జరిగాయని.. ఆ రోజు నిందితుల ఫోన్ లొకేషన్లన్నీ అక్కడే ఉన్నాయని సిట్ నివేదించింది. అదే సమయంలో బి.ఎల్.సంతోశ్ కు, రామచంద్ర భారతికి సంబంధించిన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సంభాషణలను కూడా సిట్ హైకోర్టుకు సమర్పించింది. టీఆర్ఎస్ కు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చాటింగ్ లు ఇందులో ఉన్నట్టు తేల్చింది.
తెలంగాణలో సర్కార్ కూల్చివేతకు చాలాకాలంగా కుట్ర చేస్తున్నట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఫామ్ హౌజ్ డీల్ లో నేరుగా పాల్గొన్న రామచంద్ర భారతికి, బీజేపీ కీలక నేత బి.ఎల్.సంతోష్ కు మధ్య చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సిట్ తేల్చింది. ఏప్రిల్ 11న వీళ్లిద్దరూ భేటీ అయ్యారని.. ఇందుకు సంబంధించిన ఫోన్ లొకేషన్ ఆధారాలను కూడా సిట్ హైకోర్టుకు సమర్పించింది. ఆ తర్వాత ఏప్రిల్ 26న ఎమ్మెల్యేల కొనగోలు వ్యవహారాలకు సంబంధించి బి.ఎల్.సంతోష్ కు రామచంద్రభారతి వాట్సాప్ మెసేజ్ చేసినట్లు సిట్ గుర్తించింది. అనంతరం ఆగస్టు 21న ఢిల్లీలోని కల్కాజిలో రామచంద్రభారతి, సింహయాజి, లాయర్ ప్రతాప్ కలిసి ఎమ్మెల్యేల కొనుగోలుపై చర్చించినట్లు తేల్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న జరిగిన సమావేశానికి కరీంనగర్ కు చెందిన లాయర్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారని తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 26న నందకుమార్ ఇంట్లో జరిగిన సమావేశంలో రామచంద్రభారతి, సింహయాజి, శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ పాల్గొన్నారని సిట్ వెల్లడించింది. అప్పుడే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అక్కడికి పిలిపించి మాట్లాడినట్లు తెలిపింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఒక్క టీఆర్ఎస్ కే పరిమితం కాలేదని సిట్ వెల్లడించింది. కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్లను బీజేపీలోకి రావాలని వీళ్లు ఆహ్వానించినట్లు సిట్ వెల్లడించింది. ఇది నిజమేనని లాయర్ ప్రతాప్, విజయ్ కూడా నిర్ధారించినట్లు హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహారం మరింత లోతుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఫామ్ హౌజ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సింహయాజి, రామచంద్ర భారతి, నందకుమార్ కు రూ.3లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. అయితే సిట్ దర్యాప్తుకు సహకరించారని.. పాస్ పోర్టులను సిట్ అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సిట్ కార్యాలయంలో హాజరు కావాలని.. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించింది. అయితే బెయిల్ మంజూరు అయినా కూడా నందకుమార్, రామచంద్ర భారతి బయటకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. వీరిపై మరికొన్ని కేసులు ఉండడమే ఇందుకు కారణం. సింహయాజి మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.













