ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పట్లో తేలనట్లే..!
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎంతటి దుమారానికి కారణమైందో అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తమకు అలాంటి అవసరమే లేదని.. ఇదంతా బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమని బీజేపీ తిప్పికొడుతోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంతు తేల్చి బీజేపీని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపింది. అయితే సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది కాబట్టి నిజానిజాలు నిగ్గుతేలవని.. దీన్ని సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. వాదోపవాదనల అనంతరం హైకోర్టు దీన్ని సీబీఐకి అప్పగించాలని తీర్పు చెప్పింది. దీంతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేసీఆర్ సర్కార్. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ కాబట్టి ఇందులో వాస్తవాలు బయటకు రావని వాదించింది. రాష్ట్రానికి అప్పగిస్తే ఒక సమస్య, కేంద్రానికి అప్పగిస్తే మరొక సమస్య. అందుకే దీనిపై ఎటు తేల్చుకోవాలో తెలియని సంకట స్థితి సుప్రీంకోర్టుకే ఏర్పడిందని చెప్పొచ్చు.
అందుకే ఈ కేసును ఇప్పట్లో తేల్చకుండా జులై 31కి వాయిదా వేసింది. అంటే సుమారు ఇంకా నాలుగున్నర నెలలపాటు ఈ అంశం ముందుకెళ్లే అవకాశమే లేదు. అప్పటివరకూ కేసుపై స్టేటస్ కోను విధించింది సుప్రీంకోర్టు. బహుశా ఈ కేసును ఎవరికి అప్పగించాలో తేలేసరికి తెలంగాణలో ఎన్నికలు కూడా వచ్చేస్తాయేమో.!













