వామపక్షాల అవకాశవాద రాజకీయం..!
తెలంగాణలో వామపక్షాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వామపక్షాలు ఇప్పుడు ఒంటరిగా ఒక్క సీటులో కూడా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. అందుకో పొత్తులకోసం వెంపర్లాడుతున్నాయి. నమ్ముకున్న పార్టీలు నట్టేట ముంచితే క్రాస్ రోడ్స్ లో నిల్చొని ఆపన్నహస్తం అందించే వాళ్లకోసం ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇదంతా వామపక్షాలు చేతులారా చేసుకున్నదే.. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండింగ్ పొజిషన్ నుంచి అడుక్కుతినే పరిస్థితికి రావడానికి అవకాశవాద రాజకీయాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా వామపక్షాలు మేల్కొంటాయా..?
చారిత్రక తప్పులు చేయడంలో వామపక్షాలు ముందుంటాయి. గతంలో పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసుకు ప్రధాని పీఠంపై కూర్చునే అవకాశం వచ్చింది. అయినా దాన్ని చేపట్టకుండా తిరస్కరించారాయన. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. చేజేతులా చేసుకున్న కొన్ని తప్పులే ఇప్పుడు వామపక్ష పార్టీలు ఈ దుస్థితిలో ఉండడానికి కారణం. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీల హవా నడిచేది. ఇప్పుడు లేదు. పశ్చిమ బెంగాల్ వాళ్లకు కంచుకోట. కానీ ఇప్పుడు ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క కేరళలో తప్ప ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం మరొకటి లేదు. పైగా అన్ని రాష్ట్రాల్లో పొత్తులకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితే.
తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం కొన్ని జిల్లాల్లో బలంగా ఉండేది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో వారి ప్రభావం చాలా ఎక్కువ. ఒంటరిగానే పోటీ చేసి సీట్లు గెలుచుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉండేవి. అందుకే ఒకప్పుడు ప్రధాన పార్టీలు వామపక్షాలతో పొత్తుకోసం వెంపర్లాడేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వామపక్షాలే ఇప్పుడు పొత్తులకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎవరైనా పిలిచి సీటు ఇస్తే గెలుస్తాం అని ఆలోచించాల్సిన దుస్థితి. ఇందుకు అవకాశవాద రాజకీయాలే ప్రధాన కారణం.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి సత్తా లేదనుకున్నాయి వామపక్షాలు. అందుకే కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు నిరాకరించాయి. అంగబలం, అధికార బలం, అర్థబలం అధికంగా ఉన్న బీఆర్ఎస్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాయి. దీంతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. కేసీఆర్ కూడా వామపక్షాల పాత్రను కొనియాడారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ వామపక్షాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ పార్టీలతో పొత్తు లేదని తేల్చేశారు. దీంతో లెఫ్ట్ పార్టీలు మళ్లీ దిక్కులు చూడాల్సిన పరిస్థితి. చచ్చినట్లు కాంగ్రెస్ తో కలిసి నడవాలల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ నేతలు తీసుకున్న కొన్ని అసంబద్ధ నిర్ణయాలే ఇప్పుడు ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.













