కొత్త వాళ్లపై కన్నేసిన బీఆర్ఎస్… కేటీఆర్కు బాధ్యతలు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. రెండు నెలల వరకూ పెద్దగా యాక్టివిటీ జోలికి పోని అధికార బీఆర్ఎస్ ఇప్పుడు స్పీడ్ పెంచింది. అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇద్దరూ ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కేసీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు కేటీఆర్. అయితే ఈసారి కొత్త ఓటర్లపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ కేడర్. యూతన్ ను తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది. దీని బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించింది.
కేటీఆర్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈసారి తెలంగాణలో భారీగా కొత్త ఓట్లు నమోదయ్యాయి. తొలిసారి ఓటేసే వాళ్లలో ఉత్సాహం వెల్లివిరిస్తుంటుంది. కచ్చితంగా తమ ఓటుకు న్యాయం చేయాలనుకుంటారు. అందుకే అలాంటి వాళ్లను తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గన్ షాట్ ఓట్లు తమ జేబులో ఉన్నట్టేనని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే నియోజకవర్గాల వారీగా కొత్త ఓటర్లను గుర్తించాలని పార్టీ కేడర్ ను ఆదేశించింది హైకమాండ్.
కొత్త ఓటర్లను తమ వైపునకు మలుచుకునేందుకు వారితో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలనుకుంటోంది బీఆర్ఎస్. జులై, ఆగస్ట్ నెలల్లో ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది. ఈ సమావేశాలకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కేటీఆర్ పట్ల యవతలో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు.. అలాగే కేటీఆర్ ను వారికి దగ్గర చేసేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని కేడర్ భావిస్తోంది. పైగా అన్ని జిల్లాల నేతలు తమ ప్రాంతానికి రావాల్సిందిగా కేటీఆర్ ను పిలుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి కోరికను కూడా మన్నించినట్లవుతుంది.
ఇటీవలికాలంలో యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా భారీగా విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వెంటవెంటనే వాటి భర్తీ ప్రక్రియ కూడా చేపట్టింది. కొన్ని పరీక్షల దశలో ఉన్నాయి. ఎన్నికల నాటికి ఇవన్నీ పూర్తయిపోయి ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వాళ్లందరినీ తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్. గతంలో ఎన్నడూ ఇలా యూత్ ఓటర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈసారి కేటీఆర్ ద్వారా ఆ పని చేయబోతోంది. మరి ఈ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుందనేది వేచి చూడాలి.













