కేటీఆర్‌తో ఈటల, జగ్గారెడ్డి ముచ్చట్లు..! ఏంటి సంగతి..?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో అందరి చూపూ నేతలపైనే ఉంది. వాళ్లు ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారు.. లాంటి అనేక అంశాలపై ఆరా తీయడం మామూలే. పైగా ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. సభలో ఎవరు ఏం చేస్తున్నారు.. లాబీలో ఎవర్ని కలుస్తున్నారు.. చాంబర్లలో ఎవరితో భేటీ అవుతున్నారు.. అని మీడియా మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అలా ఇవాళ రెండు ఆసక్తికర సన్నివేశాలు అసెంబ్లీలో కనిపించాయి. ఒకటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దగ్గరకు వెళ్లి కేటీఆర్ ఆలింగనం చేసుకుని ముచ్చటించడం.. రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వయంగా కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లి చర్చించడం..! ఈ రెండు పరిణామాలు ఇవాళ తెలంగాణలో హాట్ టాపిక్స్..!
కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టు ఉంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లి ఆయనతో ముచ్చటించారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే వాళ్లిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయనేది తెలీదు. జగ్గారెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదు. పైగా ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు చాలాకాలం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి బహిరంగంగాంనే విమర్శిస్తున్నారు. హైకమాండ్ కు ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు. అయినా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో తనకు ఇక స్థానం లేదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరేందుకే ఆయన కేటీఆర్ ను కలిసి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అసెంబ్లీలో మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సభ ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్ నేరుగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు దగ్గరకు వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ దాదాపు పది నిమిషాల సేపు అక్కడే మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేదానిపై అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. బీజేపీలో ఈటల రాజేందర్ ఇమడలేకపోతున్నారనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన పార్టీ మారతారని కూడా ఓ దశల టాక్ నడిచింది. అయితే ఆయన్ను ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిలో కట్టబెట్టింది హైకమాండ్. బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు ఇచ్చింది. దీంతో ఈటల రాజేందర్ అసంతృప్తి చల్లారిందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ – ఈటల రాజేందర్ భేటీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలంతా సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. ఏ పార్టీలో ఉంటే తాము గెలవగలమని బేరీజు వేసుకుంటున్నారు. పార్టీలు కూడా తమకు అవసరమైన బలమైన నేతలకోసం వెతుకుతున్నాయి. ఎన్నికల నాటికి నేతలు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భేటీల వెనుక ఏమైనా అంతరార్థం ఉందో లేదో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే!













