అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్.. మార్గం సుగమం చేస్తున్న కేసీఆర్..!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అధికార బీఆర్ఎస్ మాత్రం ఇంకా ఆ దిశగా దృష్టి పెట్టినట్లు కనిపించట్లేదు. అయితే ఇకపై పూర్తిగా ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ దిశగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగామ సీఎం కేసీఆర్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తున్నారు. దీంతో తెలంగాణలో పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ మోస్తున్నారు. కేటీఆర్ కు తెలంగాణ పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో ఇచ్చేసినట్లే తెలుస్తోంది. ఆయనే పార్టీ శ్రేణులతో రోజూ టచ్ లో ఉంటున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడా జోక్యం చేసుకోవట్లేదు. ఏదైనా కేటీఆర్ తోనే కోఆర్డినేట్ చేసుకోవాలని నేతలకు సూచిస్తున్నారు. దీంతో కేటీఆర్ భుజాలపై పెద్ద బాధ్యతే వచ్చిపడింది.
అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను కేటీఆర్ తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు కేటీఆన్ నేతృత్వంలోనే వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. అప్పుడు కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించడం తేలికవుతుంది. అందుకే కేటీఆర్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కేటీఆర్ కు ఇది సదవకాశం కూడా. అందుకే పార్టీ శ్రేణులతో కేటీఆర్ ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీపై అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చేసిందని.. నేతలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ ఆదేశించారు. సిట్టింగ్ లందరికీ దాదాపు టికెట్లు ఖాయమని కేసీఆర్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో సిట్టింగ్ లంతా నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పాదయాత్రలతో హడావుడి చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా తమతమ నియోజకవర్గాల్లో పాదయాత్రల ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇకపై పూర్తిగా నియోజకవర్గాల్లోనే ఉండాలని.. ప్రజలతో మమేకం కావాలని సూచించారు. మొత్తానికి కేటీఆర్ ఇకపై పూర్తిస్థాయిలో పార్టీకి సమయం కేటాయించబోతున్నారు.













