ఇదేందయ్యా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ..!
కోమటిరెడ్డి కుటుంబానికి తెలంగాణ రాజకీయాల్లో ఎంతో పేరుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ గా సుపరిచితులైన వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతలుగా ఎదిగారు. అయితే ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో ఉన్నారు. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కానీ అన్న వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. దీంతో వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు.
తమ్ముడు బీజేపీలో చేరడంతో అన్న పరిస్థితి మరీ దారుణంగా తయారైందని చెప్పొచ్చు. బీజేపీ తరపున తమ్ముడు బరిలో ఉన్నారు. ఆయనకు నేరుగా మద్దతు తెలపలేని పరిస్థితి. అలాగని తాను ఉంటున్న పార్టీకి పనిచేయలేని దుస్థితి. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానంటారు.. కానీ ఆ పార్టీకి పని చేయట్లేదు. అధిష్టానానికి వీర విధేయుడినని చెప్పుకుంటారు.. కానీ హైకమాండ్ ఆదేశాలను కూడా ఖాతరు చేయరు. ఢిల్లీలో ఒకమాట, హైదరాబాద్ లో మరోమాట.. అన్నట్టుంది వెంకట్ రెడ్డి తీరు. ఒకసారి తాను ముందుండి నడిపిస్తానంటారు. ఆ తర్వాత రోజు నుంచి కనిపించరు. మునుగోడు ఇప్పుడు ఆయన పరిధిలోని నియోజకవర్గమే. కానీ ఆయన మాత్రం గ్రౌండ్ లెవల్లో ఎక్కడా కనిపించట్లేదు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ.. నువ్ కూడా ఉంటావో.. వెళ్తావో చెప్పాలంటూ కొన్నాళ్లక్రితం అద్దంకి దయాకర్ స్టేజ్ పైనే ప్రశ్నించారు. అప్పుడు అద్దంకి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. చివరకు హైకమాండ్ జోక్యం చేసుకుని అద్దంకితో క్షమాపణ చెప్పించింది. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఏమాత్రం పార్టీకి పనిచేయట్లేదు. రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వెంకట్ రెడ్డి.. తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు తన తమ్ముడికి పార్టీలకతీతంగా పని చేయాలని తన అనుచరులకు ఫోన్లు చేసి చెప్తున్నారు. తాజాగా ఒక ఆడియో తీవ్ర కలకలం రేపింది. ఆయన బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటూ చేసిన సూచన కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.
తన పార్లమెంట్ పరిధిలోని మునుగోడులో ఎన్నిక జరుగుతుంటే పార్టీకి పని చేయాల్సింది పోయి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అక్కడ దిగగానే పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని.. తాను పనిచేసినా చేయకపోయినా ఉపయోగం లేదని తేల్చేశారు. పార్టీ ఎంపీ అయి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు త్వరలోనే రేవంత్ దిగిపోతాడని.. తనకే పీసీసీ వస్తుందని ప్రకటించారు. ఇవన్నీ ఇప్పుడు కోమటిరెడ్డిపై చర్యలకు దారితీస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండరని.. చాలాకాలం నుంచి వినిపిస్తున్న మాటే. అయినా పార్టీ ఎంపీ కాబట్టి హైకమాండ్ ఓర్పుతో వ్యవహరిస్తూ వస్తోంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కోమటిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ గెలిస్తే వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి వెళ్లడం ఖాయం. ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలోనే మళ్లీ యాక్టివ్ రోల్ పోషించాలనే ఉద్దేశంతో వెంకట్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వెంకట్ రెడ్డి కప్పదాటు వైఖరి పార్టీలో, తెలంగాణలో కలకలం రేపుతోంది.













