అలిగిన కోమటిరెడ్డి.. బుజ్జగిస్తున్న హైకమాండ్
కాంగ్రెస్ పార్టీ అంటేనే కొట్లాటల పార్టీ. ఎవరు ఎప్పుడు అలుగుతారో.. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. ఎవరు పార్టీ వీడుతారో కూడా అంతుచిక్కదు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్కతాటిపై నిలిచి పార్టీని గెలిపించాలని హైకమాండ్ ఇప్పటికే ఆదేశించింది. అయినా నేతల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఎవరికి వారే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కట్లేదంటూ అలుగుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ తీరుపై అలకపూనారు. దీంతో హైకమాండ్ జోక్యం చేసుకుని బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న కుటుంబంగా పేరుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా కోమటిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంటూ రాజకీయాలు చేస్తోంది. ప్రస్తుతం ఆయన నల్గొండ ఎంపీగా ఉన్నారు. తన సీనియారిటీకి తగ్గట్లు పార్టీలో తనకు గౌరవం ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి కాస్త అసంతృప్తిగానే పార్టీలో కొనసాగుతున్నారు. అదే సమయంలో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడులో పోటీ చేసి ఓడిపోయారు. లేకుంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరిపోయే వారే.. అనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫుల్ యాక్టివ్ గా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పని చేస్తోంది. హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగి వివిధ కమిటీలు ఏర్పాటు చేసి పరిస్థితులను సెట్ రైట్ చేసే పనిలో ఉంది. అయితే ఈ కమిటీల్లో ఒక్క దాంట్లో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్థానం దక్కలేదు. ఇదే ఇప్పుడు కోమటిరెడ్డి బాధ. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. అందులో కూడా కోమటిరెడ్డి పేరు లేదు. తాజాగా.. కేంద్ర ఎన్నికల కమిటీ అనౌన్స్ చేసింది.. అందులోనూ ఆయనకు స్థానం దక్కలేదు. మరోవైపు రాష్ట్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికకు ఉద్దేశించిన స్క్రీనింగ్ కమిటీలో కూడా కోమటిరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మూడు రోజులుగా హైదరాబాద్ లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తోంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ డీసీసీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కోమటిరెడ్డి మాత్రం గాంధీ భవన్ వైపు చూడలేదు. చివరకు కోమటిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన హైకమాండ్.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను ఆయన దగ్గరకు పంపించింది. సంపత్ కుమార్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు ఫోన్ చేసి మాట్లాడించారు. సాయంత్రం కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం తననకు కలవాలని కోమటిరెడ్డికి వేణుగోపాల్ సూచించారు. అయితే పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఇప్పటికే కోమటిరెడ్డి వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. మరి ఆయన అలక వీడుతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.













