కర్నాటక ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు..?
70 ఏళ్లకు పైగా దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు దోచుకున్నాయని, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రావాలని కోరుకున్నారు. ఆ రెండు పార్టీలకు తానే ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తానని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి- టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితి- బీఆర్ఎస్ గా మార్చేశారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి బీజేపీ సర్కార్ ను గద్దె దించుతానని ప్రతిన పూనారు. అంతేకాక దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తానన్నారు. ఇకపై అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.
ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ ను మార్చే క్రమంలో మొదటి నుంచి అండగా నిలిచిన వ్యక్తి జేడీఎస్ నేత కుమార స్వామి. పార్టీ ప్రకటన నుంచి, పార్టీ జెండా ఆవిష్కరణ వరకూ అన్ని సందర్భాల్లో ఆయన కేసీఆర్ వెన్నంటి నడిచారు. దీంతో కర్నాటక ఎన్నికలతోనే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తారని అందరూ భావించారు. దక్షిణ కర్నాటకలో జేడీఎస్ ప్రభావం ఎక్కువ. ఉత్తర కర్నాటకలో మాత్రం ఆ పార్టీ పాత్ర దాదాపు శూన్యం. అయితే ఉత్తర కర్నాటకతో తెలంగాణ సరిహద్దు పంచుకుంటోంది. ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం ద్వారా పాగా వేయాలని రెండు పార్టీలూ ముందు భావించాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ – బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. అంతేకాక జేడీఎస్ కు కేసీఆర్ ఆర్థికంగా సహాయం చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఒక్కసారిగా ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చేసింది. కుమార స్వామి హైదరాబాద్ రావడం మానేశారు. కేసీఆర్ కూడా కుమారస్వామిని పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఏమో బీజేపీ, కాంగ్రెస్ లకు సమానదూరం అంటున్నారు. ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక దాంతో కలిసి వెళ్లకపోతే కుమారస్వామికి మనుగడ ఉండదు. బహుశా అందుకే వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగిందని అనుకుంటున్నారు.
కానీ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలనుకున్నప్పుడు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ విషయంలో ఆప్ అన్ని రాజకీయపార్టీలకు ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆప్ పోటీ చేస్తుంది. సీట్లు గెలుస్తామా లేదా అనేది తర్వాత సంగతి. కానీ బరిలో నిలిచినప్పుడే కదా సత్తా తెలిసేది. అసలు బరిలో దిగకముందే పలాయనం చిత్తగిస్తే ఎలా? ఇప్పుడు కేసీఆర్ చేసింది అదే.. తెలంగాణతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన కర్నాటకలో ఎంతో మంది తెలుగు వాళ్లున్నారు. అలాంటి చోట కాస్తో కూస్తో ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. కానీ అసలు కర్నాటక ఊసే ఎత్తకుండా కేసీఆర్ కామ్ గా ఉండిపోయారు. అసలు దీని వెనుక కారణం ఏమై ఉంటుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు కేసీఆరే సమాధానం చెప్పాలి.













