ఆ ఊపూ, ఉత్సాహం ఏవి కేసీఆర్ గారూ..?
హస్తిన పీఠం నుంచి బీజేపీని గద్దె దించాలని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబలాటపడ్డారు. అందుకోసమే సెంటిమెంటుగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఫణంగా పెట్టి భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రకటన నుంచి పార్టీ ఆవిర్భావ వేడుక వరకూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలను పిలిచి వాళ్ల సమక్షంలో ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ వేడుక మాత్రం గతానికి పూర్తి భిన్నంగా సాగింది.
ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్నారు కేసీఆర్. ఇందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ గా మార్చేశారు. ఇకపై తాను పూర్తిగా దేశ రాజకీయాలకు పరిమితం అవుతానని ప్రకటించారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ లు ఈ దేశాన్ని అధోగతి పాలుజేశాయని, వాళ్ల పరిపాలనలో దేశం ఎంతో వెనుకబడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లే అయినా విప్లవాత్మక మార్పులతో అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించి ఆ రెండు పార్టీల వ్యతిరేక కూటమి హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు కేసీఆర్. ఆయన పిలుపు మేరకు పలు పార్టీలు కూడా ముందుకొచ్చాయి. కుమారస్వామి, స్టాలిన్, మమత బెనర్జీ.. లాంటి ఎంతో మంది నేతలు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. కుమారస్వామి అయితే పార్టీ ప్రకటన, ఆవిర్భావ వేడుకలకు స్వయంగా హాజరయ్యారు. కేసీఆర్ స్పీడ్ చూసి నిజంగానే ఈయన ఏదో సాధించబోతున్నారని అందరూ భావించారు. తెలంగాణ సాధించినట్టే దేశంలో కూడా కేసీఆర్ సత్తా చాటుతారని ఆయన అనుచరులు గట్టిగా నమ్మారు.
కానీ ఏమైందో ఏమో చల్లబడిపోయారు కేసీఆర్. గతంలో ఉన్నంత ఊపు, ఉత్సాహం కనిపించట్లేదు. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారని, పలు పార్టీలను ఆహ్వానిస్తారని అందరూ భావించారు. అయితే ఇతర పార్టీలెవరికీ ఆహ్వానాలు అందలేదు. కనీసం మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. శంకుస్థాపనకు చేసిన హడావుడి కూడా చేయలేదు. అప్పుడు ఢిల్లీ మొత్తం బ్యానర్లతో నింపేశారు. కానీ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా కానిచ్చేశారు. దీంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆశలు వదిలేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.













