అన్ని ఫోన్లు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది కవితమ్మా..?
మనం కొత్త ఫోన్ ఎప్పుడు కొంటాం..? పాత ఫోన్ పాడైనప్పుడు.. పని చేయకుండా పోయినప్పుడు.! లేదంటే కొత్త మోడల్ వచ్చినప్పుడు మనకు స్థోమత ఉంటే కొంటాం..! లేదంటే ఉన్న ఫోన్ రిపేర్ చేయించుకుంటాం. ఒక ఫోన్ ఉండగానే మరో ఫోన్ కొనడం చాలా అరుదుగా జరుగుతుంది. కొత్త ఫోన్ ను పక్కన పెడితే.. వాడని ఫోన్లను ఎక్కడో ఒక చోట పడేస్తాం.. లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తాం.. వాడని ఫోన్లంటినీ బీరువా భద్రపరచం. కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం తను వాడని ఫోన్లన్నింటినీ కూడా భద్రంగా దాచి పెట్టినట్టుంది. అది ఎందుకనేదే ఇప్పుడు ప్రశ్న.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ కుమార్తె కవితపైన కూడా ఆరోపణలు రావడంతో ఆమెను కూడా విచారిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపైన ఛార్జ్ షీట్ నమోదు చేసినప్పుడు అందులో కవిత పేరును ప్రస్తావించింది. అంతేకాక.. కవిత తాను వాడిన ఫోన్లంన్నిటినీ ధ్వంసం చేసిందని అందులో పేర్కొంది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. అన్ని ఫోన్లను ఎందుకు ధ్వంసం చేసింది.. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది.. అనే అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
అయితే ఫోన్లపై కవిత ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కవిత చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఆమెను వెంటవెంటనే విచారిస్తోంది. నిన్న విచారణ జరిపిన ఈడీ.. ఇవాళ కూడా విచారణకు రావాలని ఆదేశించింది. బహుశా ఆ ఫోన్లపైన ఈడీ గట్టిగా ప్రశ్నించినట్టుంది. వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కవిత ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇవాళ విచారణకు హాజరయ్యే ముందు ఆమె తను వాడిన పది ఫోన్లను ఒక కవర్లో IMEI నెంబర్లతో సహా పెట్టి మీడియాకు చూపించింది. అంతటితే ఆగని కవిత.. ఈడీ అధికారికి లేఖ రాసింది. తాను ధ్వంసం చేసినట్టు పేర్కొన్న అన్ని ఫోన్లను తన వ్యక్తిగత గోప్యతను పక్కన పెట్టి మరీ అంద జేస్తున్నానని.. వాస్తవాలు తెలుసుకోకుండా ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ పేర్కొనడం సరికాదని అందులో పేర్కొంది.
ఇన్నాళ్లూ ఫోన్లపై ఉన్న సస్పెన్షన్ కు ఇప్పుడు తెరపడింది. కవిత ఫోన్లను ఈడీకి అందజేసింది. అయితే అన్ని ఫోన్లను కవిత ఎందుకు వాడాల్సి వచ్చిందనేది ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. ఏడాదిన్నిర సమయంలోనే కవిత 10 ఫోన్లను మార్చడం అంటే అది మామూలు విషయం కాదు. పైగా అవన్నీ ఐఫోన్లే. ఇప్పుడు సోషల్ మీడియాలో కవితపై విపరీతంగా సైటర్లు పేలుతున్నాయి. అన్ని ఫోన్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఇంట్లో మొబైల్ షాప్ ఏమైనా పెట్టారా.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.













