బండి ఔట్..!? ఈటల దగ్గరకు క్యూ కట్టిన నేతలు..!!
తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. ఆ పార్టీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు. కనీసం పార్టీ నేతలకు కూడా క్లారిటీ ఉండట్లేదు. దీంతో ఎవరు ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందోననే భయం నేతల్లో కనిపిస్తోంది. నేతల మధ్య సమన్వయం కొరవడడం, పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం, వాటిపై హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కమలం పార్టీలో అయోమయం నెలకొంది. ఎవరికై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందో.. ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడు వెలువడుతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అందుకే నేతలంతా ఆసక్తిగా హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇటీవలికాలంలో బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన్ను మోదీ కేబినెట్లోకి తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ నేతలు మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని.. ఇదంతా బీఆర్ఎస్ నేతల కుట్ర అని చెప్తూ వచ్చారు. అయితే నిన్న బండి సంజయ్ స్వయంగా తన పరిస్థితిపై అనుచరులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12న మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. అప్పటివరకూ తాను అధ్యక్షుడిగా ఉంటానో లేదో అని సందేహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నారనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
బండి సంజయ్ ని తప్పించిన తర్వాత ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ముందునుంచి సాగుతోంది. వివాద రహితుడిగా పేరొందడం, ఆర్థికంగా బలమైన నేత కావడం, చిల్లర రాజకీయాలు చేసే మనస్తత్వం కాకపోవడంతో అధిష్టానానికి ఈటల రాజేందర్ పై నమ్మకం కలిగింది. దీంతో అయన్ను సమర్థంగా వాడుకోవాలని భావించింది. కానీ ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు ఇవ్వడాన్ని బండి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. బండిని తప్పిస్తే రాష్ట్రం పార్టీ పరిస్థితి దిగజారిపోతుందని హైకమాండ్ ను హెచ్చరించింది. అయితే హైకమాండ్ మాత్రం ఈ హెచ్చరికలకను సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. బండిని మార్చేందుకే సిద్ధమైనట్టు అర్థమవుతోంది.
నిన్నటి వరకూ ఈటల రాజేందర్ పై జితేందర్ రెడ్డి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వారిద్దరి మధ్య వార్ నడిచింది. బండికి అనుకూలంగా ఉన్న జితేందర్ రెడ్డి పలు సందర్భాల్లో ఈటలను బహిరంగంగానే వ్యతిరేకించారు. అలాంటాయన ఇవాళ అనూహ్యంగా ఈటల రాజేందర్ ఇంటికెళ్లి భేటి అయ్యారు. బండి సంజయ్ ని తప్పించి ఈటలకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారని తెలిసే జితేందర్ రెడ్డి వెళ్లి కలిశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బండిని నమ్ముకుంటే కష్టమని.. అందుకే ఈటల క్యాంప్ లోకి జితేందర్ రెడ్డి జంప్ చేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఈ వారంలో పార్టీ పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.













