కేసీఆర్కు జనగామ టెన్షన్..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే నాలుగు స్థానాలకు మాత్రం ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. వాటిలో జనగామ ఒక్కటి. ప్రస్తుతం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చిన కేసీఆర్.. ముత్తిరెడ్డిని మాత్రం పక్కన పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అందుకోసమే ఈ సీటుకు అభ్యర్థిని అనౌన్స్ చేయకుండా పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే ముత్తిరెడ్డి తనకు సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో జనగామ వ్యవహారం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది.
జనగామ టికెట్ ఎవరికి దక్కుతుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2014 నుంచి ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచి సత్తా చాటారు. ఈసారి కూడా తనకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే సొంత కుమార్తె, అల్లుడు ముత్తిరెడ్డిపై తిరుగుబాటు చేయడం పార్టీలో సంచలనం కలిగించింది. తన పేరిట తండ్రి ముత్తిరెడ్డి అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ ఆయన కుమార్తె వీధికెక్కారు. తనపేరిట తండ్రి సంపాదించిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఇంటిపోరు కాస్త వీధికెక్కడంతో పార్టీకి పెద్ద సమస్యగా మారింది.
ఎమ్మెల్యేగా ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. అందుకే జనగామ టికెట్ ను వరుసగా రెండు సార్లు గెలిచినా ముత్తిరెడ్డికి ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో ముత్తిరెడ్డి ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్లే తనకు టికెట్ రావట్లేదని ఆగ్రహంతో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని.. ప్రజలు ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్తారని ముత్తిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ తప్పకుండా టికెట్ తనకే ఇస్తారనే ఆశాభావంతో ఉన్నారు.
అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి భావిస్తున్నారు. తనకు జనగామ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ టికెట్ దక్కడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. పల్లాకు టికెట్ ఇచ్చేందుకే ముత్తిరెడ్డిని పక్కన పెట్టారని.. వచ్చే లిస్టులో కచ్చితంగా పల్లా పేరు ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే పల్లాకు టికెట్ ఇస్తే ముత్తిరెడ్డిని ఎలా సంతృప్తి పరచాలనే దానిపై పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోంది. ముత్తిరెడ్డిని వదులుకోవడం ఇష్టం లేని కేసీఆర్ ఆయనకు ఏదైనా మరో కీలక పదవి కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానికి ముత్తిరెడ్డి సంతృప్తి చెందుతారా.. లేకుంటా పార్టీ మారతారా.. అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.













