ఫామ్ హౌజ్ కేసులో బిగ్ ట్విస్ట్..! కేసీఆర్ సర్కార్కు హైకోర్టు ఝలక్..!!
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నేతలు ప్రయత్నించారంటూ.. దానిపై దర్యాప్తుకోసం సిట్ ను ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్. అయితే కేసీఆర్ సర్కార్ కనుసన్నల్లో నడిచే సిట్ పై తమకు నమ్మకం లేదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. సిట్ పరిధిలోంచి ఈ కేసును తప్పించి సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. దీంతో కేసీఆర్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఫామ్ హౌజ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే వార్త సంచలనం కలిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక బీజేపీకి చెందిన కీలక నేతలు ఉన్నారని చెప్పారు. అందుకే దీనిపై నిజానిజాలు వెలుగులోకి తెచ్చేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. తమను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని.. బీజేపీలో చేరితే డబ్బు సహా పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సిట్ కేసు నమోదు చేసింది. అనంతరం విచారమ జరిపిన సిట్.. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి చెందిన పలువురు ప్రయత్నించారని తన నివేదికలో వెల్లడించింది.
అయితే సిట్ పూర్తిగా సీఎం కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుంటోందని.. సిట్ దర్యాప్తు వల్ల ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని కోరింది. పలు రాష్ట్రాలకు చెందిన వారికి ఈ కేసులో ప్రమేయం ఉందని సిట్ ఆరోపిస్తున్నందున సీబీఐకి అప్పగించడం వల్లే న్యాయం జరుగుతుందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది బీజేపీ. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కేసును సీబీఐకి బదలాయిస్తూ తీర్పు చెప్పింది. సిట్ వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలని సిట్ నిర్ణయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసేందుకు సిద్ధమవుతోంది. రేపు ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.













