టికెట్ కోసం విక్రమ్ గౌడ్ దరఖాస్తు..! రాజాసింగ్ దారెటు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల్లో సీట్ల పంచాయితీ రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే నాలుగు మినహా అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరికి టికెట్లు దక్కుతాయో అంతుచిక్కడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ అభ్యర్థుల వడపోతలో బిజీగా ఉంది. బీజేపీలో ఇప్పుడిప్పుడే అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులెవరో తేలేందుకు చాలా సమయమే పట్టేలా ఉంది. బీజేపీలో ఎంతటి నేతలైనా పోటీ చేయాలంటే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే అని నిబంధన పెట్టారు. దీంతో నేతలంతా అప్లికేషన్ పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తెలంగాణలో గోషామహల్ సీటు వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. ఈ స్థానంలో బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది అంతుచిక్కడం లేదు. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ తరపున రాజా సింగ్ పోటీ చేసి గెలుపొందారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. ఇప్పటి వరకూ ఆయనపై బహిష్కరణ ఎత్తివేయలేదు. దీంతో ఆయన బీజేపీ సభ్యుడు కాదు. ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. అందుకే స్థానిక నేత విక్రమ్ గౌడ్ తనకు గోషా మహల్ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే తెలియడం లేదు.
తనపై బహిష్కరణ వేటును బీజేపీ ఎత్తివేస్తుందని.. కచ్చితంగా తనకు టికెట్ ఇస్తుందని రాజాసింగ్ భావిస్తున్నారు. అయితే ఆయనపై ఇప్పటివరకూ బీజేపీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ బీజేపీ నుంచి టికెట్ రాకపోతే బీఆర్ఎస్ తరపున రాజాసింగ్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి హరీశ్ రావును రాజాసింగ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాక.. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించని నాలుగు స్థానాల్లో గోషా మహల్ కూడా ఉంది. ఒకవేళ బీజేపీ రాజాసింగ్ కు టికెట్ ఇవ్వకపోతే తాము టికెట్ ఇచ్చేందుకే గోషా మహల్ కు అభ్యర్థిని ప్రకటించకుండా బీఆర్ఎస్ పక్కన పెట్టిందనే టాక్ నడుస్తోంది.
మరోవైపు గత ఎన్నికల్లో గోషా మహల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రాజాసింగ్ చేతిలో ఓడిపోయిన విక్రమ్ గౌడ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. రాజాసింగ్ ను పార్టీ బహిష్కరించడంతో కచ్చితంగా తనకే టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీలో ఓ వర్గం రాజాసింగ్ కు మద్దతుగా ఉంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో రాజాసింగ్ టికెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అదే జరిగితే రాజాసింగ్ పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే తమ పార్టీ తరపున టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.













