బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఆయుధాన్ని ఇచ్చిన బిజెపి!
తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది. ఆయా రాజకీయ పార్టీలన్నీ సరికొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగబోతున్నాయి. అందుకే పార్టీలన్నీ ప్రజల వద్దకు వెళుతున్నాయి. ప్రత్యర్థుల బలహీనతలను ఆధారంగా చేసుకుని వాటిని ప్రజల చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిని టార్గెట్ చేసేందుకు పెద్ద ఆయుధం లభించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు మండుతున్నాయి. ఈనెల 50 రూపాయలను ఒక్కో సిలిండర్ పై రేటు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కో డొమెస్టిక్ సిలిండర్ ధర దాదాపు 1200 కు చేరుకుంది. ఇది పేదలకు మోయలేని భారం. 2014 450 రూపాయలు సిలిండర్ ధర ఉండేది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాటు యూపీఏ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. గ్యాస్ ధరలు పెంచి ప్రభుత్వం పేదల పొట్ట కొడుతుందని నేటి ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు విమర్శించేవారు. కానీ ఇప్పుడు మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే కానీ తగ్గట్లేదు. ఇది విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది.
ఇదే అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ తమ ఎన్నికల అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి దీన్ని సమర్థంగా వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత ధరలు పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గ్యాస్ ధర కొంచమైనా తగ్గించేందుకు కేసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో సిలిండర్ పైన 50 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ తరహా భారాన్ని భరించేవారు. ఇప్పుడు కెసిఆర్ కూడా ధరాభారాన్ని కొంచెం షేర్ చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి నేతలను ఇరుకున పెట్టాలనుకుంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా తీసుకుంది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రామ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా 500 రూపాయలకు అందిస్తున్నామని, ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు.
ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ గ్యాస్ ధరల పెంపును అస్త్రంగా చేసుకోవడంతో బిజెపి ఇరకాటంలో పడింది. మరి ఈ అంశాన్ని బిజెపి ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.













