గద్దర్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం తప్పా..?
విప్లవ కవి, గాయకుడు గద్దర్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి, నక్సలైట్లకు సహకరించిన అతనికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడమేంటి.. అని చాలా మంది అడుగుతున్నారు. ఎంతోమంది పోలీసులను పొట్టన పెట్టుకున్న నక్సలైట్లకు సహకరించిన గద్దర్ కు రాచమర్యాదలు చేస్తారా.. అని కొంతమంది పోలీస్ అధికారులు కూడా మండి పడుతున్నారు. ఐపీఎస్ అధికారి సజ్జన్నార్ గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి నమస్కరించడంపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై తన గుండెలు మండిపోతున్నాయన్నారు.
గద్దర్ ప్రజాగాయకుడిగా పేరొందారు. ఎన్నో ఏళ్ల క్రితమే ప్రజా జీవితంలోకి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన జనంతో మమేకమై పని చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో తన వంతు సాయం చేశారు. ఆయన పాటలు లక్షలాది మందిని కదిల్చాయి. ఆలోచింపజేశాయి. సాహిత్యకారులందరూ ఆయన్ను వాగ్గేయకారుడిగా గుర్తించారు. ఆయన మరణించారని తెలియగానే ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేకుండా.. ఆ కులం ఈ కులం అనే బేధం లేకుండా అందరూ వాలిపోయారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ దగ్గరుండి నడిపించారు. అది ఆయన సంపాదించుకున్న అభిమానం.
ఆయన కొన్ని అంశాల్లో మొదట్లో ప్రభుత్వంతో విభేదించి ఉండొచ్చు. ప్రభుత్వంపై పోరాడి ఉండొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసి ఉండొచ్చు. అయినా ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఆయన్ను దగ్గరకు చేర్చుకున్నాయి. పాలకులు ఆయన్ను వేనోళ్ల పొగిడారు. ఆయనతో కలిసి పని చేశారు. కొంతమంది రాజకీయ నేతలు శిక్షలు అనుభవించి.. బయటికొచ్చి దర్జాగా తిరుగుతున్నారు. రాజకీయ నాయకుల అవతారమెత్తి దోచుకున్నారు. అలాంటి వాళ్లు చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన దాఖలాలు మన దేశంలో కోకొల్లలు. అలాంటప్పుడు గద్దర్ కు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తే వచ్చిన నష్టమేంటో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు కొంతమంది దీన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారో తెలియట్లేదు.













