గద్దర్ అందరివాడా..? కొందరివాడా..? అసలు ఎవరివాడు?
బూర్జువా పార్టీలకు, భూస్వామ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి గద్దర్. దళిత బహుజనుల కోసం, పీడత ప్రజల విముక్తి కోసం ఆయన ఎర్రజెండా పట్టారు. బడుగు బలహీన వర్గాలకు అన్నిట్లో సమాన అవకాశాలు ఉండాలంటూ కాలికి గజ్జెగట్టి పాట పాడారు. మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడుగా ముద్ర వేసుకున్నారు. ప్రజాస్వామ్య వాదుల గుండెల్లో నిద్రపోయారు. తన పాటల తూటాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. తన జీవిత చరమాంకం వరకూ ఎర్రజెండా మెడలో అలాగే ఉండిపోయింది. కానీ చివరి ఘడియల్లో ఆ ఎర్రజెండా మాత్రం ఆమడదూరంలో ఆగిపోయింది.
అనారోగ్యంతో గద్దర కన్నుమూశారు. ఆయన తన జీవిత చరమాంకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన జీవితమంతా పాటకే అంకితం చేసినా చివరకు ఏమి సాధించామని ప్రశ్నించుకుంటే.. అది ప్రశ్నగానే మిగిలిపోయింది. అందుకే ఆయన అందరివాడుగు గుర్తింపు పొందాలనుకున్నారు. గుళ్లు గోపురాలు తిరిగారు. అన్నేళ్లపాటు వ్యతిరేకించిన పార్టీల నేతలను ఆలింగనం చేసుకున్నారు. అందరూ అక్కున చేర్చుకున్న వాళ్లే కానీ ఒక్కరూ ఆదుకున్నవారు లేరు. చివరి రోజుల్లో ఆయన పడిన ఇబ్బందులు ఆయన్ను కలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు. తనకు సాయం చేయండని నోరు తెరిచి అడిగేందుకు ఆత్మగౌరవం అడ్డు వచ్చేది. అందుకే అన్నింటినీ పంటిబిగువన భరించారు.
గద్దర తన పాటతో యావత్ తెలుగు ప్రజానీకానికి దగ్గరయ్యారు. ఆయన్ను తమ దరికి చేర్చుకునేందుకు ప్రయత్నించని పార్టీలు లేవు. కానీ ఆయన మాత్రం వామపక్షవాదిగానే ఉండిపోయారు. ఎర్రజెండాను వదిలేందుకు ఎన్నడూ సాహసం చేయలేదు. అయితే కొన్నేళ్లుగా ఆయనలో మార్పు స్పష్టంగా కనిపించింది. గుళ్లు, గోపురాల చుట్టూ తిరిగారు. ఆధ్యాత్మికత వైపు కాస్త మొగ్గు చూపినట్టు కనిపించింది. ఇది కొందరికి నచ్చలేదు.. కానీ ఆయన ఎవరినీ పట్టించుకోలేదు. ఆయనలో అలాంటి మార్పు ఎందుకు కలిగిందో ఎవరికీ తెలీదు. అలాగే కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీల నేతలను కలిసి ఆలింగనం చేసుకున్నారు. ముద్దులు పెట్టారు. వామపక్షాలకు క్రమంగా దూరమయ్యారు.
ఆఖరి ఘడియల్లో కూడా అదే కనిపించింది. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయం దగ్గర బూర్జువా పార్టీ నేతలదే హంగామా. గద్దర్ తమవాడని చెప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలూ పోటీ పడ్డారు. ఆయనకు క్రెడిట్ ఇచ్చేందుకు.. ఆయనపై నాలుగు మంచి మాటలు చెప్పి మీడియాలో కనిపించేందుకు ఉబలాటపడ్డారు. కానీ తను జీవితాంతం నమ్మిన వామపక్షవాదులు మాత్రం ఎక్కడో దూరంగా ఉండిపోయారు. ఏదో వచ్చాం.. నివాళులు అర్పించాం.. అన్నట్టు వ్యవహరించారు. తమకు గద్దర్ తో సంబంధం లేనట్టు నటించారు. మరి గద్దర్ నిజంగా ఎవరివాడు..?













