పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్..!! అంతా అధిష్టానం చేతుల్లోనే ఉందా..?
ఈటల రాజేందర్ పార్టీ మారబోతున్నారని కొంతకాలంగా తెలంగాణలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన అక్కడ ఇమడలేకపోతున్నారని, ఆ పార్టీ సిద్ధాంతాలను వంటబట్టించుకోలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. పైగా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తమను తక్కువ చేసి చూడడం లాంటి కారణాల వల్ల ఆయన అగ్రహంగా ఉన్నారని.. అందుకే పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఇంతలో అధిష్టానం నుంచి పిలుపు రావడం, ఢిల్లీ వెళ్లి చర్చించడం జరిగిపోయాయి. దీంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే పార్టీ మార్పుపై ఇంకా ఊహాగానాలు ఆగకపోవడంతో ఈటల రాజేందరే స్వయంగా మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు.
చొక్కాలు మార్చినంత ఈజీగా తాను పార్టీ మారే వ్యక్తిని కాదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను బీజేపీని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ అన్నాక చిన్నా చితకా సమస్యలు కామనే అని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలపై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేశానంటూ వస్తున్న వార్తలను కూడా ఈటల రాజేందర్ ఖండించారు. తనకు ఎప్పుడూ అలాంటి అలవాటు లేదన్నారు. పార్టీ నేతలు పిలిస్తే తప్ప తాను ఢిల్లీ వెళ్లనని.. వాళ్లు అడిగితే తప్ప ఏదీ చెప్పనని వివరించారు. అంతేకాక తాను ఏం మాట్లాడినా పార్టీ ప్రయోజనాలకోసమే మాట్లాడతానని.. వ్యక్తిగతంగా ఎవరిపైనా చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదని ఈటల స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలపడిందని, బీజేపీ వీకైపోయిందని వస్తున్న వార్తలను ఈటల తోసిపుచ్చారు. బీజేపీ సంస్థాగతంగా బలపడుతోందని, గతానికి ఇప్పటికి పార్టీ తేడాను మీరే గమనించి ఉంటారని ఆయన చెప్పారు. ఎన్నికల సమయానికి అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. తనకు ఏదో ఉన్నత పదవి ఇస్తున్నారనేదానిపై ఈటల స్పందించారు. తనకు అలాంటి సమాచారమేదీ లేదని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. దీంతో ఈటల బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
మరోవైపు కేసీఆర్, కౌశిక్ రెడ్డి పైన కూడా ఈటల రాజేందర్ స్పందించారు. తనను చంపేందుకు కౌశిక్ రెడ్డి సుపారీ ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఇక ధరణితో కేసీఆర్ కు డబ్బుల పంట పండిందన్నారు ఈటల రాజేందర్. ధరణి తర్వాత పేదల భూములు మాయమైపోయాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ధరణిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి కేసీఆర్ కు ఓటు వేయొద్దని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ విలువ లేకుండా పోయిందన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అందుకే ఈసారి కేసీఆర్ ను ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు ఈటల.













