రంగంలోకి ట్రబుల్ షూటర్..! టీపీసీసీ సెట్ అవుతుందా..?
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభంపై హైకమాండ్ దృష్టి పెట్టింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి, సీనియర్లకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. రేవంత్ వర్గానికే ఎక్కువ పదవులు కట్టబెట్టారంటూ సీనియర్ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. దీంతో టీడీపీ నుంచి వచ్చి పదవులు పొందిన రేవంత్ వర్గీయులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరోవైపు సీనియర్లంతా ఇవాళ మరోసారి భేటీ అయి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది.
దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీలో కీలక నేత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై మంచి పట్టున్న నేత. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడి నేతలను పేరుపెట్టి పిలిచేంత సాన్నిహిత్యం దిగ్విజయ్ సింగ్ కు ఉంది. ఇప్పుడున్న సీనియర్ నేతలంతా దిగ్విజయ్ సింగ్ తో సత్సంబంధాలు కలిగిన నేతలే. రేవంత్ వర్గానికి మాత్రమే దిగ్విజయ్ సింగ్ కొత్త. కొత్తగా వచ్చిన రేవంత్ వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రస్తుత ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పై సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంతేకాదు.. మాణిక్కం ఠాగూర్ కు డబ్బులిచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం సాధించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ను చక్కదిద్దే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది హైకమాండ్. మాణిక్కం ఠాగూర్ ను ఇన్ ఛార్జ్ గానే ఉంచి.. దిగ్విజయ్ సింగ్ ని అడ్వైజర్ హోదాలో రంగంలోకి దింపింది.
తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై రెండ్రోజుల నుంచి హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. తెలంగాణ పరిస్థితులను ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ .. అధినేత మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి వరకూ వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం ఖర్జే సూచన మేరకు ఆయన రాహుల్ గాంధీని కలిసేందుకు మాణిక్కం ఠాగూర్ రాజస్థాన్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఇవాళ మాణిక్కం ఠాగూర్ రాహుల్ గాంధీని కలుస్తారని తెలుస్తోంది. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా టీపీసీసీ పరిణామాలపై ఆరా తీశారు. తెలంగాణ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న దిగ్విజయ్ సింగ్ అయితే ప్రస్తుతం సంక్షోభాన్ని సరిదిద్దగలరని ప్రియాంక గాంధీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ తో మాణిక్కం ఠాగూర్ భేటీ కంటే ముందే దిగ్విజయ్ సింగ్ ని అడ్వైజర్ గా రంగంలోకి దింపిది హైకమాండ్.
వాస్తవానికి ఈరోజు సాయంత్రం సీనియర్ నేతలంతా మరోసారి భేటీ అవుతున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ లోపే దిగ్విజయ్ సింగ్ నియామకం జరిగింది. మరి సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియాల్సి ఉంది. సమావేశాన్ని కంటిన్యూ చేస్తారా.. లేకుంటే దిగ్విజయ్ తో చర్చించేంతవరకూ వెయిట్ చేస్తారా అనేది చూడాలి. దిగ్విజయ్ తో సత్సంబంధాలు కలిగిన సీనియర్లు తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో రేవంత్ కు దిగ్విజయ నియామకం కాస్త ఇబ్బందికరమనే చెప్పొచ్చు. దిగ్విజయ్ తో రేవంత్ వర్గం ఎప్పుడూ కలిసి పని చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ వర్గానికి, సీనియర్లకు మధ్య దిగ్విజయ్ ఎలా సఖ్యత కుదురుస్తారనేది ఆసక్తిగా మారింది.













