తెలంగాణపై చంద్రబాబు మళ్లీ నజర్..! రేపు ఖమ్మంలో భారీ బహిరంగ సభ..!!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ యాక్టివ్ కానుందా..? టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయన తెలంగాణ తెలుగుదేశంపై మళ్లీ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే ఆయన కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని చేశారు. కాసాని బాధ్యతలు చేపట్టాక పార్టీని మళ్లీ యాక్టివే చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రతిరోజూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేదానిపై చర్చిస్తున్నారు. అందులో భాగంగానే రేపు ఖమ్మంలో టీటీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది.
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి మంచి కేడర్ ఉంది. నాయకులు దూరమయ్యారేమో కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని అభిమానించే ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో 15 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే రాష్ట్రం విడిపోయి ఐదేళ్లయిన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. దీన్ని బట్టి ఈ రెండు జిల్లాలో టీడీపీకి మంచి కేడర్ ఉందని అర్థమవుతోంది. దీన్ని ఇప్పుడు మళ్లీ వినియోగించుకోవాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ.
ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రభావం ఎక్కువ. దీంతో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలమైన కార్యకర్తలు ఉన్నారు. పలువురు నేతలు కూడా ఇప్పటికీ టీడీపీకోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ జెండాపైన, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పైన ఉన్న అభిమానం అలాంటిది. అందుకే ఖమ్మంలో ఈసారి మళ్లీ సత్తా చాటాలనుకుంటోంది టీటీడీపీ. రేపు ఖమ్మంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇటీవలికాలంలో తెలంగాణలో పార్టీ బహిరంగసభకు చంద్రబాబు అటెండ్ కావడం ఇదే తొలిసారి. ఖమ్మంలో ఎన్నికల శంఖారావం పూరించి.. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని టీటీడీపీ భావిస్తోంది.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఇప్పటికీ సరైన కేడర్ లేదు. అధికారంలో ఉన్నా కూడా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యలాగా మారింది. అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి కూడా ఇక్కడ అంతంత మాత్రమే. ఈ అంశాలనే సొమ్ము చేసుకోవాలనుకుంటోంది టీటీడీపీ. అసంతృప్త నేతలు కచ్చితంగా టీడీపీనే ఆశ్రయించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. బలమైన నేతలకు టికెట్లు ఇస్తే ఖమ్మం జిల్లాలో కచ్చితంగా 2-3 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే మొదట ఖమ్మం, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.













