బీజేపీతో పొత్తు కోసమే ఖమ్మంలో చంద్రబాబు సభ పెట్టారా..?
ఖమ్మంలో చంద్రబాబు సభపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఒక ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. బీజేపీతో పొత్తుకోసమే ఖమ్మంలో చంద్రబాబు సభ పెట్టారని చెప్పారు. అసలు చంద్రబాబు ఖమ్మం సభకు, బీజేపీతో పొత్తుకు సంబంధం ఏంటని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని ఒక్కో రాజకీయ పార్టీ తమదైన కోణంలో విశ్లేషించుకోవడం సహజమే. ఇప్పుడు ఖమ్మంలో చంద్రబాబు సభను కూడా వైసీపీ ఇదే కోణంలో చూస్తున్నట్టు అర్థమవుతోంది. అసలు చంద్రబాబు సభకు, బీజేపీతో పొత్తుకు లింకేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖమ్మంలో చంద్రబాబు సభ విజయవంతమైంది. టీడీపీ శ్రేణలు కూడా ఈ స్థాయిలో సభ సక్సెస్ అవుతుందని ఊహించలేదు. 2014 తర్వాత చంద్రబాబు తెలంగాణలో బహిరంగసభలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక కామెంట్స్ చేశారు. ఇప్పటికీ తమది సమైక్యవాదమేనని.. రెండు రాష్ట్రాలు కలిసుండాలనేదే తమ సిద్ధాంతమని ఆ మధ్య సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్ చేశారు. ఇది తీవ్ర దుమారానికి కారణమైంది. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమని తేల్చేశారు. తెలంగాణ, ఆంధ్ర మళ్లీ కలవడమనేది జరగని పని అని.. అలా మాట్లాడేవాళ్లకు బుద్ది లేదని విమర్శించారు. దీని ద్వారా తాను సమైక్యవాదిని ఎంతమాత్రం కాదని.. తాను తెలంగాణకు అనుకూలమని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాక.. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర తెలుగుదేశానిదేనని తాను, ఎన్టీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వల్లెవేశారు. అంతేకాక.. చివర్లో తమ్ముళ్లందరూ తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు సభ పెట్టారు.. తాను చెప్పాల్సింది ఏదో చెప్పారు. మరి దీనికి బీజేపీకి లింక్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. వాస్తవానికి ఏపీలో బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. కేంద్రంతో సఖ్యతకోసం పరితపిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు రావట్లేదు. కనీసం చంద్రబాబును పట్టించుకోవట్లేదు. కేంద్రం నుంచి పిలుపువస్తుందని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబుతో ఇప్పుడు బీజేపీకి అవసరం ఏమీ లేదు. పైగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అడగకముందే బీజేపీకి సహకరిస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబుతో బీజేపీకి పనేముంటుంది.? అందుకే బీజేపీ.. చంద్రబాబును అస్సలు పట్టించుకోవట్లేదు. కానీ చంద్రబాబుకు మాత్రం బీజేపీతో అవసరం చాలా ఉంది. అందుకే తెలంగాణలో సభ ద్వారా తన చాణక్యాన్ని ప్రదర్శించారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉంటుందని నమ్ముతోంది. ఇలాంటి సమయంలో మంచి కేడర్ కలిగిన టీడీపీ కూడా రంగంలోకి దిగితే ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదం ఉంది. తెలంగాణలో గట్టిగా ట్రై చేస్తే కనీసం పాతిక స్థానాల్లో అయినా టీడీపీ ప్రభావం చూపించగలగదని భావిస్తున్నారు. ఈ పాతిక సీట్లలో బీజేపీని దెబ్బకొట్టినా చాలు.. ఆ పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. ఈ విషయం బీజేపీకి అర్థమైతే తమతో పొత్తుకు ప్రయత్నిస్తుందని టీడీపీ ఆశిస్తుంది. అప్పడు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లొచ్చు. ఈ పొత్తు తర్వాత స్టేజ్ లో ఏపీలో కూడా పొత్తుకు దారితీయొచ్చు. ఇదే చంద్రబాబు స్ట్రాటజీ.. అనేది సజ్జల మార్క్ విశ్లేషణ. మరి ఇందులో వాస్తవం ఎంతో వేచి చూడాలి.













