బీఆర్ఎస్కు సెటిలర్లు దూరమవుతున్నారా..?
రాష్ట్ర విభజన తెలుగు రాష్ట్రాల రాజకీయాలను సమూలంగా మార్చేసింది. ఒక రాష్ట్రంపై ప్రభావం మరో రాష్ట్రంపై తప్పకుండా ఉంటోంది. తెలంగాణ ప్రభావం ఏపీపై పెద్దగా లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభావం మాత్రం తెలంగాణపై భారీగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్షలాది మంది సెటిలర్లు తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం. రాష్ట్ర విభజన వరకూ కేసీఆర్ ను వ్యతిరేకించిన సెటిలర్లు ఆ తర్వాత అన్నీ మర్చిపోయి ఆయనకే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర విభజనకు మూలకారణం అని సెటిలర్లు భావించడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది.
2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏపీ, తెలంగాణగా మారాయి. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో పెద్దగా విభేదాలు లేవు. ఉన్నా అవి రాజకీయ పరమైన సమస్యలే. ఏపీలో మొదటి విడత చంద్రబాబు అధికారంలోకి రాగా.. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో మాత్రం వరుసగా రెండు సార్లూ కేసీఆరే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో కేసీఆర్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. బాబు కూడా కేసీఆర్ తో మొదట్లో సఖ్యతగా ఉన్నా ఆ తర్వాత విభేదించారు. జగన్ కూడా అంతే. మొదట్లో కేసీఆర్ కు, జగన్ కు మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఆయితే ఆ తర్వాత గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు అరెస్టును జగన్ ప్రభుత్వం చేయిస్తే.. దానికి కేసీఆర్ మద్దతు కూడా ఉందనేది టీడీపీ అభిమానుల ఆరోపణ. చంద్రబాబు అరెస్టును కేసీఆర్ ఖండించకపోవడం కూడా ఇందుకు కారణం. వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ కలిసి చంద్రబాబును ఇరికించారని టీడీపీ నేతలు, అభిమానులు భావిస్తున్నారు. జగన్ ను ఈసారి ఎలాగైనా గద్దె దించుతామని టీడీపీ కంకణం కట్టుకుంది. మరోవైపు హైదరాబాద్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపడితే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో బీఆర్ఎస్ పైన కూడా అసంతృప్తితో ఉన్నారు టీడీపీ నేతలు.
ఔనన్నా కాదన్నా తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ లాంటి పలు నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువ. ఈ విషయం గ్రహించే కేసీఆర్ సెటిలర్లతో అనుకూలంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబును వ్యతిరేకించినా కేసీఆర్ వెంటే నడిచిన సెటిలర్లు ఇప్పుడు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. శతృవు మిత్రుడు శతృవైనట్లు జగన్ కు స్నేహితుడిగా ఉన్న కేసీఆర్ అంటే ఇప్పుడు సెటిలర్లు కాస్త ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి కచ్చితంగా సెటిలర్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తారనే భయం ఆ పార్టీలో పట్టుకుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడంతో పలువురు సెటిలర్లు ఆ పార్టీకి దగ్గరవుతున్నారని సమాచారం. అందుకే సెటిలర్లను దగ్గర చేసకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే తాజాగా చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది. సెటిలర్ల కోసమే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.













