ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ… కేసీఆర్ బిగ్ ప్లాన్!
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకూ బహిరంగ సభ పెట్టలేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ భవన్ లో అధినేత కేసీఆర్ అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించలేదు. ఇప్పుడు ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ నిర్వహిస్తారని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ఖమ్మంలో ఆవిర్భావ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఖమ్మం లాంటి చిన్న పట్టణంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడానికి కారణాలేంటి… అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వ్యూహాత్మకంగానే ఖమ్మంను ఆవిర్భావ సభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ఏపీ, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. ఇక్కడ సభ ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్ లపై కూడా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం వామపక్షాలు బీఆర్ఎస్ తో కలసి పనిచేస్తున్నియి. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పొత్తుకోసం బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఖమ్మం సభ ద్వారా లెఫ్ట్ పార్టీలతో తన అనుబంధాన్ని చాటిచెప్పేందుకు మరో అవకాశం కేసీఆర్ కు దక్కుతుంది. దాన్ని దేశవ్యాప్తంగా వాడుకునేందుకు దోహదపడుతుంది.
మరోవైపు ఇటీవలే టీటీడీపీ ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి సత్తా చాటింది. మళ్లీ పునర్వైభవం కోసం ఖమ్మం సభను తొలి మెట్టుగా భావించింది. ఖమ్మం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అక్కడి నుంచే మళ్లీ తన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో బలం లేదనే ఆరోపణలున్నాయి. పైగా పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇక్కడ తారస్థాయిలో ఉన్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి.. తదితరులు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటప్పుడు ఖమ్మంలో సభ నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్ పైన వస్తున్న ఆరోపణలన్నింటికీ చెక్ చెప్పే అవకాశం కలుగుతుంది. ఇదే కేసీఆర్ ప్లాన్.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తదితరులను కేసీఆర్ ఆహ్వానించారు. కేజ్రివాల్, అఖిలేష్ యాదవ్ సభకు వచ్చేందుకు ఇప్పటికే అంగీకారం తెలియజేశారు. మరికొంతమంది జాతీయ నేతలను కూడా ఈ సభకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ సభ ద్వారా జాతీయస్థాయిలో అటెన్షన్ డ్రా చేసేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.













