కేసీఆర్కు బీఆర్ఎస్ కలసి రావట్లేదా..?
కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. సంప్రదాయాలకు, కట్టుబాట్లకు పెద్ద పీట వేసే వ్యక్తి. ఏ కార్యం చేపట్టినా మంచిచెడులు ఆరా తీసి ప్రారంభిస్తుంటారు. దీంతో ఇన్నాళ్లూ ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్టు సాగింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు.. పెట్టిన తర్వాత కేసీఆర్ కు తిరగులేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన అన్ని కార్యక్రమాలూ సూపర్ సక్సెస్ అయ్యాయి. అందుకే ఆయన్ను తెలంగాణ పితగా ఇప్పుడు అందరూ పిలుచుకుంటున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సమితితోనే సాధ్యమైంది.
అయితే ఇప్పుడు టీఆర్ఎస్ లేదు. దాని స్థానంలో బీఆర్ఎస్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా పాలనను అమలు చేయాలనేది ఆయన కొత్త సంకల్పం. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులనను ఏకం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు సాగుతోంది వ్యవహారం. దీంతో కేసీఆర్ కు బీఆర్ఎస్ కలసి రావట్లేదని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు వరకూ కేసీఆర్ కు తిరుగులేదు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇంటా బయటా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదు. అయితే గతంలో టీఆర్ఎస్ ఉన్నంత బలంగా ఇప్పుడు బీఆర్ఎస్ లేదనేది జగమెరిగిన సత్యం. ఇందుకు కారణాలు ఒకటని చెప్పలేం. అనేక కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఈ విషయం కేసీఆర్ కూడా గ్రహించారు. అయితే వాటిని చక్కదిద్దేందుకు కూడా ఇప్పుడు ఆయనకు సమయం ఉండట్లేదు. అదే ఇప్పుడు పెద్ద సమస్య.
బీజేపీకి వ్యతిరేకంగా బీఆరెఎస్ ప్రారంభించారు కేసీఆర్. అప్పటి నుంచి కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు కవిత అరెస్టుకు దగ్గర్లో ఉన్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో తాను అనుకున్నంత వేగంగా బీఆర్ఎస్ అడుగులు పడట్లేదు. బీఆర్ఎస్ కు మొదటి నుంచి మద్దతుగా నిలిచిన కుమార స్వామి, స్టాలిన్ తదితరులు ఇప్పుడు కేసీఆర్ వెంట లేరు. మమత బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ లాంటి వాళ్లు కూడా వేరుకుంపటి పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అన్నీ ఇబ్బందులే. మరి కేసీఆర్ వీటి నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి.













