బీఆర్ఎస్ పార్టీ సరికొత్త ఎలక్షన్ స్ట్రాటజీ..!
తెలంగాణలో దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మరోసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. విపక్షాలపై ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ పైచేయి సాధించడం కేసీఆర్ స్టైల్. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారాయన. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను అనౌన్స్ చేసేశారు. మొత్తం 119లో 115 సీట్లకు అభ్యర్థులను డిసైడ్ చేసేశారు. మిగిలింది ఇక నాలుగు స్థానాలే. విపక్షాలు ఇప్పటికీ అభ్యర్థులను వెతుక్కుంటున్న సమయంలో కేసీఆర్ జనంలోకి పంపించేశారు. ప్రజల్లోకి వెళ్లి తమదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామాల తీర్మానాలు ఈసారి చర్చనీయాంశమయ్యాయి.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఊరూవాడా ఏకమయ్యాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ ఏకతాటిపై నడిచి సాధించుకున్నారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పలు గ్రామాలు గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నాయి. ఇలాంటి ఏకగ్రీవ తీర్మానాలు చేయడం ద్వారా విపక్షాలను గ్రామాల్లోకి రానివ్వకుండా చేయాలనేది బీఆర్ఎస్ ఎత్తుగడ. పలు జిల్లాల్లోని గ్రామాలు ఇప్పటికే ఇలాంటి తీర్మానాలు చేశాయి. తాము గులాబీ పార్టీకి మద్దతుగా ఉంటామని తీర్మానించాయి.
కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ ఇప్పటికే కేసీఆర్ కంచుకోట. కొత్తగా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కేసీఆర్ కు తిరుగులేని మెజారిటీ సాధించేందుకు స్థానిక నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు ఎమ్మెల్సీ కవిత.. కామారెడ్డిలో విస్తృతంగా తిరుగుతున్నారు. గ్రామస్థాయి నేతలను కలసి తీర్మానాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. మాచారెడ్డి మండలంలోని 10కి పైగా గ్రామాలు కేసీఆర్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. త్వరలో మరిన్ని గ్రామాలు కూడా ఇలాంటి తీర్మానాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
కామారెడ్డిలోనే కాదు.. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల, చెన్నూర్, మహబూబ్ నగర్.. లాంటి చోట్ల కూడా ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు గ్రామస్థాయి నేతలు చందాలు వేసుకుంటున్నారు. సిద్ధిపేటలోని రాంపూర్ లో హరీశ్ రావుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస గౌడ్ కు రూపాయి నాణేలతో తులాభారం వేసారు. దాంతో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏకగ్రీవ తీర్మానాలు మున్ముందు మరింత ఊపందుకోనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి తీర్మానాలు చేయించాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసింది. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఇలా ఒక పార్టీకి అనుకూలంగా గ్రామాలు తీర్మానం చేయడం సరికాదని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.













