బీఆర్ఎస్ నేతలపై కన్నేసిన బీజేపీ.. నయానో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం..!!
తెలంగాణలో డీలా పడ్డ బీజేపీ.. మళ్లీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. చేరికలు ఆగిపోవడం, అంతర్గత విభేదాలు, నేతల పక్కచూపులు లాంటి అనేక అంశాలు కమలం పార్టీని కుదేలు చేస్తున్నాయి. అమిత్ షా వచ్చి అన్నింటినీ సెట్ చేస్తారనుకుంటే ఆయన హ్యాండ్ ఇచ్చారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అయితే హైకమాండ్ తో పనిలేకుండా తమ పని తాము చేసుకుపోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు తనదైన వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకున్నారు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలను లాక్కోవాలని ట్రై చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వాలంటే కచ్చితంగా బలమైన నేతలు అవసరం. ఇప్పటికీ అని నియోజకవర్గాల్లో గట్టి నేతలు బీజేపీకి లేరు. ఇది పెద్ద సమస్యగా మారింది. పైగా ఇటీవల పార్టీలో చేరిన నేతలు కూడా పక్క చూపులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో తెలియట్లేదు. ఎన్నికలు సమీపించేనాటికి చాలా మంది నేతలు బీజేపీని వీడి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరుతారనే అంచనాలు ఉన్నాయి. వీటిని అడ్డుకోవాలి.. లేకుంటే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలి. ప్రస్తుతం ఉన్న నేతల్లో చాల మంది అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఆపడం కష్టమే.
అందుకే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకట్టుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి బలమైన నేతలను తమ గూటికి రప్పించుకోవడం ద్వారా ఆ పార్టీని వీక్ చేయాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచే వలసలు జరిగితే కచ్చితంగా అది ప్రజల్లో ఆ పార్టీపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పార్టీ పనైపోవడం వల్లే నేతలంతా వేరే పార్టీల్లో చేరిపోతున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. అది బీఆర్ఎస్ ను వీక్ చేస్తుంది. బీజేపీ స్కెచ్ ఇదే. బీఆర్ఎస్ నేతలను నయానో భయానో లొంగదీసుకోవాలనుకుంటోంది కమలం పార్టీ.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులు మొదలయ్యాయి. ఇలాంటి దాడులు మున్ముందు కూడా కంటిన్యూ అవుతారని భావిస్తున్నారు. వీటిని ఎదుర్కోగల నేతలు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు. ఎదుర్కోలేనివాళ్లు బీజేపీతో కాళ్లబేరానికి వస్తారు. ఇలా నేతలను తమ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటోంది బీజేపీ. బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ప్రజాప్రతినిధులు తమతో టచ్ లో ఉన్నారంటూ బండి సంజయ్ నిన్న చెప్పారు. దీని వెనుక స్ట్రాటజీ ఇదేనని తెలుస్తోంది. మరోవైపు బీజేపీని వీక్ చేసేందుకు కాంగ్రెస్ ను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ బలంగా ఉన్నచోట బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయి పనిచేస్తాయి. బీజేపీ ఓడిపోయిన కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళను తమ పార్టీలోకి లాక్కునేందుకు కేసీఆర్ స్కెచ్ వేసినట్లు బండి సంజయ్ చెప్పారు. అయితే కేసీఆర్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది.













